సీఎం జగన్ సారథ్యంలో ఏపీ అభివృద్ధిలో ముందుకు సాగాలని కేసీఆర్ ఆకాంక్షించారు. తెలుగు ప్రజలు ఆత్మీయతతో కలసి మెలసి ఉండాలని అన్నారు.
విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో గత కొంత సేపటి క్రితమే.. అభిమానులు, వైకాపా కార్యకర్తల కోలాహలం నడుమ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా జగన్ ప్రమాణ స్వీకారం చేసిన విషయం విదితమే. గవర్నర్ నరసింహన్ జగన్ చేత సీఎంగా ప్రమాణం చేయించారు. ఈ క్రమంలో ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. వైఎస్ జగన్ చిన్న వయస్సులో సీఎం అయ్యాడని, అతని వయస్సు చిన్నదైనా అతనికి ఉన్న బాధ్యత మాత్రం చాలా పెద్దదని కేసీఆర్ అన్నారు.
ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన జగన్‌కు తెలంగాణ ప్రభుత్వం, ప్రజల తరఫున తాను శుభాకాంక్షలు తెలుపుతున్నానని కేసీఆర్ అన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల నడుమ ఖడ్గ చాలనం కాదని, కరచాలనం ఉండాలని కేసీఆర్ అన్నారు. ఇరు రాష్ట్రాలు గోదావరి, కృష్ణా జలాలను సద్వినియోగం చేసుకోవాలని, అభివృద్ధిలో ముందుకు సాగాలని కేసీఆర్ ఆకాంక్షించారు. కృష్ణా జలాల్లో సమస్యలు ఉన్నాయన్న కేసీఆర్ ఆ నదిలో లభించే ప్రతి నీటి చుక్కను ఒడిసి పట్టుకోవాలని కేసీఆర్ అన్నారు.
సీఎం జగన్ సారథ్యంలో ఏపీ అభివృద్ధిలో ముందుకు సాగాలని కేసీఆర్ ఆకాంక్షించారు. తెలుగు ప్రజలు ఆత్మీయతతో కలసి మెలసి ఉండాలని అన్నారు. జగన్‌కు ఏపీ ప్రజలు అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చారని, దాన్ని జగన్ సద్వినియోగం చేసుకుని ఏపీని అభివృద్ధి పథంలో నిలపాలని, తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరును నిలబెట్టాలని, ఆయన ఆశయాలకు అనుగుణంగా జగన్ పనిచేయాలని కేసీఆర్ అన్నారు. కనీసం 3, 4 సార్లు జగన్ సీఎం అయి ఏపీకి సేవలందించాలని కేసీఆర్ ఆకాంక్షించారు. సీఎంగా పనిచేయగల సామర్థ్యం జగన్‌కు ఉందని, ఆయన ఏపీని ప్రగతి పథంలో ముందుకు తీసుకుపోతారని కేసీఆర్ అన్నారు.