ఉద్యోగులు, కార్మికులతో మాట్లాడి వారి సమస్యల పరిష్కారానికి, కంపెనీలను లాభాలబాటలో పయనింపచేయడానికి వారి సూచనలు, సలహాలను పరిగణనలోకి తీసుకోవడంకానీ చేయకుండా కేంద్ర ప్రభుత్వం ఒంటెత్తు పోకడలకు పోవడంపై తీవ్రస్థాయిలో విమర్శలు చెలరేగుతున్నాయి. ప్రయివేటుపరం చేయడంవల్ల బాధ్యతల నుంచి తప్పించుకున్నట్లవుతుందేకానీ బాధ్యతలను స్వీకరించినట్లవదు. విశాఖపట్నం ఉక్కు కర్మాగారం ప్రయివేటీకరణపై దేశవ్యాప్తంగా నిరసనల హోరు పెల్లుబికుతోంది. వందకు వందశాతం అమ్మేస్తామంటూ కేంద్రం చేసిన ప్రకటన కూడా అగ్నికి ఆజ్యం తోడైనట్లైంది. . తాను అనుకున్నది అనుకున్నట్లుగా చేయాలనే దృఢ సంకల్పంతో ఉన్న కేంద్రం ఈ విమర్శలను లెక్కచేయకుండా ముందుకు వెళుతోంది.
తప్పులు చేసేవరకు వేచిచూడటం వారి విధానం
వివిధ రాజకీయ పార్టీల నేతలంతా తప్పులు చేసేవరకు ప్రధానమంత్రి నరేంద్రమోడీకానీ, అమిత్షా కానీ ఎదురుచూస్తారని, తప్పులు చేసిన తర్వాత వాటిని తమకు అనుకూలంగా మలచుకుంటారని, ఆ తర్వాత బీజేపీ బలోపేతానికి కృష్టిచేస్తారని ఆ పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలే చెబుతున్నారు. ప్రధానమంత్రిగా నరేంద్రమోడీ అవలంబిస్తున్నవిధానాలపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ప్రయివేటీకరణ రాగం ఆలపిస్తున్న ప్రధానమంత్రికి ఏ రాష్ట్రం నుంచి కూడా వ్యతిరేకత వ్యక్తం కావడంలేదు. దీనికితోడు ఆయా రాష్ట్రాల్లో ఉన్న నేతలపై ఉన్న కేసులు కూడా వారిచేత ఏమీ మాట్లాడించలేకపోతున్నాయి. విశాఖ ఉక్కును వంద శాతం ప్రయివేటుపరం చేయడంలోకానీ, ఏపీలో ఉన్న ఆస్తులను అదానీపరం చేయడంలోకానీ ఇక్కడినుంచి వ్యతిరేకత వ్యక్తం కాకపోవడం కూడా వారికి వరంగా మారింది. ప్రజలెవరూ పట్టించుకోరు.. నేతలపై ఉన్న కేసులు, వారి అవసరాలు వారిని మాట్లాడనీయడంలేదు. దేశవ్యాప్తంగా బీజేపీ విస్తరించాలనుకన్న మోడీ, అమిత్ షాకు ఇలాంటి నేతలే వరంగా మారుతున్నారు. ఏ రాష్ట్రంలో బీజేపీ బలహీనంగా ఉందో పరిశీలించుకొని అక్కడి పరిస్థితులను అంచనా వేసుకొని ఆ మేరకు వీరు నిర్ణయం తీసుకుంటారు.
నిపుణుల మాట వినడమెందుకు?
ఎయిర్ పోర్టుల ప్రయివేటీకరణకానీ, గంగవరం పోర్టులను అమ్మేయడంకానీ, విశాఖ ఉక్క కర్మాగారం ప్రయివేటీకరణకానీ ఏదైనా సరే కేంద్రం ప్రభుత్వం తాను అనుకున్నదే చేసుకుపోతోంది. ఎవరినీ సంప్రదించడంలేదంటూ మేధావులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఉన్నవన్నీ ప్రయివేటుపరం చేస్తే సంభవించే పరిణామాలను అంచనా వేయకుండా సొంత నిర్ణయాలు తీసుకోవడం దేశానికి గొడ్డలిపెట్టుగా మారబోతున్నాయనంటున్నారు. ఇప్పుడు ఉన్నవన్నీ అమ్ముకుంటూ పోతే భవిష్యత్తులో ఏవిధంగా ఆదాయమార్గాలుంటాయనేది ప్రభుత్వాలు ఆలోచించుకోవాలని, ఎల్లప్పుడూ పన్నులు వసూలుచేసి ఆ పన్నులపైనే ఆధారపడదామంటే కుదిరేపనికాదంటున్నారు ఆర్థికవేత్తలు.