ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు. ఎవరికి ఛాన్స్ దక్కుతుందా? అని ఎన్నెన్నో అంచనాలు. ఊహాగానాలు. కానీ, సీఎం కేసీఆర్ అనూహ్య నిర్ణయంతో అందరి అంచనాలు తలకిందులు అయ్యాయి. ఎవరి ఊహించని పేరు తెర మీదికి వచ్చింది. ఆయనే బండ ప్రకాష్. ప్రస్తుతం బండ ప్రకాష్ రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్నారు. కానీ, సీఎం ఆదేశాల మేరకు ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ దాఖలు చేశారు. ఈ నిర్ణయం వెనుక గులాబీ బాస్ పెద్ద ఎత్తుగడ ఉన్నట్లు స్పష్టమవుతున్నది. ఒక రకంగా ఈటలకు చెక్ పెట్టే ఆలోచనగా కనిపిస్తున్నది.
ఈటల రాజేందర్‌ను సీఎం కేసీఆర్ క్యాబినెట్ నుంచి భర్తీ చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడం, ఉప ఎన్నికల్లో ఈటల గెలవడం అంతా తెలిసిన కథే. ఆయన సామాజికవర్గమైన ముదిరాజ్‌లు తెలంగాణలో బలమైన సామాజికవర్గంగా కొనసాగుతున్నారు. క్యాబినెట్ ఈటలను భర్తరఫ్ చేయడంతో ఒకరకంగా ఆ సామాజిక వర్గం నేతలు టీఆర్‌ఎస్‌పై గుర్రుగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే అదే సామాజికవర్గానికి చెందిన బండ ప్రకాష్‌ను ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో దింపినట్లు తెలుస్తున్నది.
తెలంగాణ క్యాబినెట్ నుంచి ఈటల భర్తరఫ్ తర్వాత ఆ స్థానాన్ని భర్తీ చేయలేదు. ఈటలకు చెందిన సామాజికవర్గం నేతతో ఆ మంత్రి పదవిని భర్తీ చేయాలనే ఆలోచనలో సీఎం కేసీఆర్ ఉన్నట్లు తెలుస్తున్నది. అందుకే బండ ప్రకాష్‌ను ఎమ్మెల్సీగా ఎంపిక చేసినట్లు ప్రచారం జరుగుతున్నది. అతి త్వరలో క్యాబినెట్ విస్తరణ ఉండనున్నదని తెలుస్తున్నది. ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన నేతతోనే ఈటల స్థానాన్ని భర్తీ చేసి, ఆ సామాజికవర్గం నేతలు బీజేపీ వైపు వెళ్లకుండా చూడాలని సీఎం కేసీఆర్ ఆలోచనగా కనిపిస్తున్నది. ఈ నేపథ్యంలో బండ ప్రకాష్‌కు మంత్రి పదవిని కట్టబెట్టి పరోక్షంగా ఈటలకు చెక్ పెట్టాలని గులాబీ బాస్ ప్రయత్నంగా సమాచారం.