భైంసాలో బండి సక్సెస్..పాత ఫార్ములాతో సవాల్.!

-

తెలంగాణ రాజకీయాల్లో ఓ వైపు షర్మిల పాదయాత్ర ఇష్యూ, మరోవైపు బండి సంజయ్ పాదయాత్ర ఇష్యూ నడిచిన విషయం తెలిసిందే. గత రెండు రోజులుగా షర్మిల ఇష్యూలో ఏం జరిగిందో అందరికీ తెలిసిందే. నర్సంపేటలో ఆమె పాదయాత్రపై టీఆర్ఎస్ శ్రేణులు దాడి చేయడం, కారులని ధ్వంసం చేయడం, క్యారవాన్ తగలబెట్టడం, ఆమెని అదుపులోకి తీసుకోవడం, మళ్ళీ హైదరాబాద్‌లో ధ్వంసమైన కారుతో ప్రగతి భవన్‌కు వెళ్లడానికి షర్మిల ప్రయత్నించడం, పోలీసులు అరెస్ట్ చేయడం, మళ్ళీ బెయిల్ పై బయటకు రావడం జరిగాయి. ఇక ఎలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయకుండా పాదయాత్రకు అనుమతించారు.

ఇటు భైంసాలో బండి పాదయాత్ర చేయాలని అనుకుంటే..భైంసా సున్నిత ప్రాంతమని చెప్పి పోలీసులు ఆపేయడం, కోర్టుకెళ్లి బండి పర్మిషన్ తెచ్చుకుని, భైంసా శివారులో పాదయాత్ర స్టార్ట్ చేయడం, అలాగే సభ నిర్వహించడం చేశారు. అయితే షర్మిల ఇష్యూ ఎక్కువ హైలైట్ అవ్వడంతో భైంసాలో బండి పాదయాత్ర సభ సక్సెస్ అయిన విషయం అంతగా హైలైట్ కాలేదు. వాస్తవానికి భైంసా శివారులో సభ పెట్టుకున్నా సరే..ఆ సభని ఫెయిల్ చేయాలని టీఆర్ఎస్ గట్టిగానే ప్రయత్నాలు చేసింది.

ఆ సభకు భారీగా కమలదళం రాకుండా పోలీసులు అడ్డుకునే ప్రయత్నాలు చేశారు. భైంసాలో ఇంటర్నెట్ కట్ చేశారు..144 సెక్షన్ పెట్టి బీజేపీ శ్రేణులని సభకు వెళ్లకుండా అడ్డంకులు సృష్టించారు. అయితే ఎన్ని జరిగినా సరే..భైంసా సభకు భారీ స్థాయిలో బీజేపీ శ్రేణులు వచ్చాయి. బండితో పాటు ముఖ్య నేతలు సభకు హజరై..టీఆర్ఎస్ సర్కార్‌పై విరుచుకుపడ్డారు.

అలాగే బీజేపీ అధికారంలోకి రాగానే భైంసా పేరుని మారుస్తామని, మహిషా అని  పేరు పెడతామని, భైంసాలో శాంతియుత వాతావరణం నెలకొనేలా చేస్తామని బండి హామీ ఇచ్చారు. అయితే ఇక్కడ పక్కాగా మతం ఫార్ములాతో బండి ముందుకెళ్లారు. బీజేపీకి ఉన్న పాత ఫార్ములా హిందుత్వ అజెండా కనిపించింది. ఆ ఫార్ములాతో సక్సెస్ అయ్యేలా భైంసాలో స్కెచ్ వేశారు. మొత్తానికి భైంసాలో బండి సభ సక్సెస్ అయిందనే చెప్పవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news