ఏపీలో వాలంటీర్లు ఉంటారా.. ఊడుతారా అనే చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి. వాలంటీర్ల సేవల కొనసాగింపుపైన ఇంకా స్పష్టత రాలేదు. ఎన్నికల సమయంలో కొందరు వాలంటీర్లు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అప్పుడు చంద్రబాబు ఇచ్చిన ప్రకటనతో కొంతమంది ఇంకా సర్వీసులో కొనసాగుతున్నారు. కూటమి ప్రభుత్వం కొనసాగిస్తుందన్న ఆశ కూడా వారిలో ఉంది. అయితే ఇప్పటివరకు వాలంటీర్ల విధులు ఏంటనేది ప్రభుత్వం నిర్ణయించలేదు.
సచివాలయాలకు వచ్చి ప్రతిరోజు హాజరు వేసుకోవాలన్న నిబంధన కూడా వారికి పెట్టలేదు. కానీ వారికి జీతాలు చెల్లించేందుకు అధికారులు బిల్లులు పెట్టడం సంచలనంగా మారింది. పని చేయకుండానే వాలంటీర్లు ఒక నెల జీతం తీసుకున్నారు. మరో నెలకు కూడా వారికి జీతం ఇవ్వాలంటూ బిల్లులు పెట్టడంతో పనిచేయకుండానే జీతాలు ఇస్తున్నారని కూటమిలోని నేతలు ఆరోపిస్తున్నారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వాలంటీర్ల సేవలను కొనసాగిస్తోంది. వారికి ఇచ్చే వేతనం రూ 10 వేలు చేస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు. అయితే, వాలంటీర్ల కొనసాగింపు విధి విధానాలు ఇప్పటి వరకు ప్రభుత్వం ఖరారు చేయలేదు. తాజాగా వేతనాలపై ప్రభుత్వం నిర్ణయం చర్చనీయాంశంగా మారుతోంది.
గ్రామ, వార్డు సచివాలయాల్లో రెండన్నర లక్షల మంది వలంటీర్లు ఉండగా, ఎన్నికల సమయంలో వారిలో సగం మంది రాజీనామా చేశారు. దాదాపు లక్ష మందికిపైగా వాలంటీర్లు విధుల్లో కొనసాగుతున్నారు. వారికి ఇప్పటివరకు ఎలాంటి డ్యూటీ అప్పగించలేదు. ఒక్కొక్కరికీ రూ.5 వేల చొప్పున నెలకు సుమారుగా రూ.50 కోట్ల దాకా జీతాలుగా చెల్లిస్తున్నారు. వారు చేసే పింఛన్ పంపిణీని ఇప్పుడు సచివాలయ ఉద్యోగులే సమర్థవంతంగా ఇంటి వద్దకే అందిస్తున్నారు. ఈ కార్యక్రమం కోసం వలంటీర్లు అవసరం లేదంటూనే జీతాలు ఇవ్వడం ఏంటని పలువురు ప్రశ్నిస్తున్నారు.
పనిచేయకుండానే వాలంటీర్లకు జీతాలు ఇస్తున్నందున వారిని ఏదో ఒక పనికి వాడుకోవాలనే డిమాండ్ ఉంది. అటు వాలంటీర్లు కూడా ప్రభుత్వం నుంచి ఇదే ఆశిస్తున్నారు. వాలంటీర్లు లేకపోతే పెన్షన్ల పంపిణీ సాధ్యం కాదని ఎన్నికల ప్రచారంలో వాదనలు వినిపించాయి. రాజీనామా చేయని వాలంటీర్లు అప్పట్లో పింఛన్ పంపిణీ చేసేందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ అధికారులు అంగీకరించలేదు. కొన్ని రాజకీయ పార్టీలు కోర్టుకు వెళ్ళిన నేపథ్యంలో వాలంటీర్ల సేవలకు అప్పుడు ఆటంకం ఏర్పడింది. లబ్దిదారుల అకౌంట్లలోకి పెన్షన్ నగదును బదిలీ చేశారు అధికారులు.
కూటమి ప్రభుత్వం వచ్చాక జులై నెలలో సచివాలయ ఉద్యోగులతోనే పకడ్బందీగా పింఛన్ల పంపిణీ చేపట్టవచ్చని చంద్రబాబు సర్కార్ నిరూపించింది. రెండో నెల పెన్షన్లను ఆగస్టు1న ఇదే విధంగా మరోసారి పంపిణీ చేసేందుకు చర్యలు ప్రారంభించింది. ఓవైపు వాలంటీర్లకు జీతాలు ఇస్తూనే పెన్షన్‌ల పంపిణీకి సచివాలయం ఉద్యోగులను వినియోగించడం ఏంటని అధికారులు ప్రశ్నిస్తున్నారు. అసలు వాలంటీర్ల విధుల విషయంలో చంద్రబాబు ప్రభుత్వం ఆలోచన ఏంటనేది అంతుబట్టకుండా ఉంది.