బండి ఎఫెక్ట్: బీజేపీకి అదే మైనస్ అవుతుందా?

-

తెలంగాణలో నెక్స్ట్ ఎలాగైనా అధికారంలోకి రావాలని బీజేపీ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఊహించని రీతిలో పుంజుకున్న బీజేపీ, కేసీఆర్‌కు చెక్ పెట్టేసి అధికారం దక్కించుకోవాలని చూస్తోంది. అందుకు తగ్గట్టుగానే రాజకీయాలు చేస్తూ ముందుకెళుతుంది. ముఖ్యంగా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ దూకుడు ప్రదర్శిస్తున్నారు. మునుపటి బీజేపీ అధ్యక్షులు మాదిరి కాకుండా, తనదైన శైలిలో కేసీఆర్ ప్రభుత్వాన్ని ఎటాక్ చేస్తున్నారు. అదే మొన్నటివరకు బీజేపీకి ప్లస్ అయింది.

Bandi Sanjay Kumar | బండి సంజ‌య్
Bandi Sanjay Kumar | బండి సంజ‌య్

దుబ్బాక ఉపఎన్నికలో గెలవడం కావొచ్చు. జి‌హెచ్‌ఎం‌సి ఎన్నికల్లో సత్తా చాటడం కావొచ్చు…ఎటాక్ రాజకీయాలు చేయడం వల్లే ఈ విజయాలు సాధ్యమయ్యాయి. ఇప్పుడు హుజూరాబాద్ ఉపఎన్నికలో కూడా గెలవడానికి కూడా బీజేపీ ఎటాక్ మోడ్‌లో ముందుకెళుతుంది. అయితే హుజూరాబాద్ ఎన్నికని పక్కనబెడితే, ఈ ఎటాక్ వల్ల ఒకోసారి మైనస్ అయ్యే అవకాశాలున్నాయని తెలుస్తోంది. జి‌హెచ్‌ఎం‌సి ఎన్నికల్లో టీఆర్ఎస్ లక్ష్యంగా బీజేపీ దూకుడు ప్రదర్శించింది.

బండి సంజయ్, కేసీఆర్‌ని లక్ష్యంగా చేసుకుని అవినీతి ఆరోపణలు చేశారు. అలాగే ఆయన త్వరలోనే జైలుకు వెళ్తారంటూ ప్రచారం చేశారు. అటు పి‌వి, ఎన్టీఆర్ ఘాట్‌లని తొలగించలంటూ మాట్లాడిన ఎం‌ఐ‌ఎంని కూడా గట్టిగా టార్గెట్ చేసి సక్సెస్ అయింది. అలాగే వరదల్లో బండి పోయినవారికి బండి, కారు పోయినవారికి కారు ఇస్తామని ప్రచారం చేశారు. ఈ పరిణామాలన్నీ జి‌హెచ్‌ఎం‌సి ఎన్నికల్లో బీజేపీకి ప్లస్ అయ్యాయి.

అయితే ఇప్పుడు కూడా బండి అదే ఎటాక్ మోడ్‌లో ఉన్నారు. 2023లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాగానే కేసీఆర్‌ ఫాంహౌస్‌, ప్రగతి భవన్‌ను లక్ష నాగళ్లతో దున్నుతామని, ఆ భూములను ఎస్సీ, ఎస్టీ, బీసీలకు పంచుతామని, ప్రగతి భవన్‌ను దున్ని, అక్కడ 125 అడుగుల అంబేడ్కర్‌ విగ్రహం పెడతామని  చెప్పి ఘాటు వ్యాఖ్యలే చేశారు. ఇక బండి మాట్లాడినట్లుగా ఇదంతా ప్రాక్టికల్‌గా సాధ్యమవుతుందా? అంటే చాలా కష్టమనే చెప్పొచ్చు.

ఎందుకంటే కేసీఆర్‌పై అవినీతి ఆరోపణలు చేశారు గానీ, ఆ దిశగా చర్యలు లేవు. అటు జి‌హెచ్‌ఎం‌సి ప్రజలకు అండగా ఉంటున్నట్లు కనిపించడం లేదు. ఇలా సాధ్యంకాని స్టేట్‌మెంట్స్ ఇవ్వడం వల్ల బీజేపీకే మైనస్ అయ్యేలా కనిపిస్తుంది. ఇప్పుడు కేసీఆర్ ఫామ్ హౌస్, ప్రగతి భవన్‌ల గురించి బండి చేసిన వ్యాఖ్యలు కూడా అలాగే ఉన్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news