కారుకు కమలం మరో దెబ్బ…లోక్‌సభ ఉపఎన్నిక?

-

తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీకి..బీజేపీ ఎప్పటికిప్పుడు ఏదొక షాక్ ఇస్తూనే ఉంటుంది. ఎలాగైనా టీఆర్ఎస్ పార్టీని దెబ్బకొట్టడమే లక్ష్యంగా బీజేపీ ముందుకెళుతుంది. ఇదే క్రమంలో టీఆర్ఎస్ లో బలమైన నేతలని బీజేపీలోకి తీసుకోస్తున్న విషయం తెలిసిందే. అదేవిధంగా ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయించి…ఉపఎన్నికలు వచ్చేలా చేసి టీఆర్ఎస్ పార్టీని చావుదెబ్బ కొడుతున్నారు.

ప్రస్తుతం మునుగోడు ఉపఎన్నిక నడుస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పటివరకు అసెంబ్లీ ఉపఎన్నికలు వచ్చాయి..కానీ ఈ సారి పార్లమెంట్ ఉపఎన్నికలు వచ్చేలా బీజేపీ ప్లాన్ చేసినట్లు తెలిసింది. మునుగోడు ఉపఎన్నిక అయ్యాక అధికార పార్టీకి చెందిన ఒక ఎంపీని చేర్చుకునేందుకు కమలం పావులు కదుపుతుందని తెలిసింది. అలాగే కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒక ఎంపీని కూడా బీజేపీలో చేర్చుకుంటారని తెలుస్తోంది. ప్రస్తుతం తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీకి 9 మంది ఎంపీలు ఉన్నారు.

అటు బీజేపీకి 4, కాంగ్రెస్ పార్టీకి 3, ఎం‌ఐ‌ఎం పార్టీకి ఒక ఎంపీ ఉన్నారు. అయితే 9 మందిలో ఒకరిపై బీజేపీ వల వేసినట్లు తెలిసింది. ఆ ఎంపీని లాగి…పదవికి రాజీనామా చేయించి, ఉపఎన్నికలో మళ్ళీ నిలబెట్టి గెలిపించుకోవాలని బీజేపీ ప్లాన్ చేసినట్లు తెలిసింది. అది కూడా ఉత్తర తెలంగాణలోని ఎంపీలపైనే ఫోకస్ పెట్టినట్లు సమాచారం. ఇప్పటికే ఒక ఎంపీతో పలు దఫాలుగా చర్చలు జరిపినట్లు తెలిసింది. మునుగోడు ఉపఎన్నిక అయ్యాక ఆ ఎంపీని బీజేపీలోకి తీసుకొచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.

ఇక కాంగ్రెస్ ఎంపీ కూడా ఒకరు బీజేపీలోకి వస్తారని చెబుతున్నారు. ఆ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అని క్లియర్‌గా తెలుస్తోంది. మరి కోమటిరెడ్డి ఎంపీ పదవికి రాజీనామా చేసి…బీజేపీలోకి వెళ్తారా? లేదా? అనేది చూడాలి. మొత్తానికైతే ఎంపీ స్థానాలపై కూడా బీజేపీ ఫోకస్ పెట్టింది. అన్నివైపులా కారు పార్టీని ఇరుకున పెట్టేలా కమలం వ్యూహాలు ఉంటున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news