మహేశ్వరంలో సబితమ్మ ‘కారు’ స్పీడుకు ‘హస్తం’ బ్రేక్ వేస్తుందా?

-

సబితా ఇంద్రారెడ్డి..తెలంగాణ రాజకీయాల్లో సీనియర్ నాయకురాలు. తన భర్త ఇంద్రారెడ్డి మరణంతో రాజకీయాల్లోకి వచ్చి సక్సెస్‌ఫుల్‌గా కొనసాగుతున్న నాయకురాలు. మొదట ఇంద్రారెడ్డి టి‌డి‌పి నుంచి మూడుసార్లు చేవెళ్ళ స్థానం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 1985, 1989, 1994 ఎన్నికల్లో టి‌డి‌పి నుంచి గెలిచిన ఇంద్రారెడ్డి 1999 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి విజయం సాధించారు. కానీ ఆ వెంటనే ఆయన హఠాన్మరణం చెందారు. దీంతో 2000 చేవెళ్ళ ఉపఎన్నికలో సబితమ్మ కాంగ్రెస్ నుంచి నిలబడి విజయం సాధించారు.

sabitha indra reddy

2004లో కూడా సబితమ్మ విజయం సాధించి..వైఎస్సార్ క్యాబినెట్‌లో హోమ్ మంత్రిగా పనిచేశారు. తరవాత నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా చేవెళ్ళ ఎస్సీ రిజర్వడ్ కావడంతో సబితా 2009 ఎన్నికల్లో మహేశ్వరం నుంచి బరిలో దిగి విజయం సాధించారు. ఆ తర్వాత కూడా వైఎస్సార్, రోశయ్య, కిరణ్ కుమార్ మంత్రివర్గాల్లో పనిచేశారు. రాష్ట్ర విభజన తర్వాత జరిగిన 2014 ఎన్నికల్లో ఆమె పోటీ చేయలేదు…కానీ ఆమె తనయుడు కార్తీక్ రెడ్డి చేవెళ్ళ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు.

2018 ఎన్నికలోచ్చేసరికి సబితా..కాంగ్రెస్ నుంచి పోటీ చేసి మహేశ్వరంలో మళ్ళీ గెలిచారు. కానీ ఆ వెంటనే ఆమె టి‌ఆర్‌ఎస్‌లోకి జంప్ కొట్టేశారు. ఇప్పుడు కే‌సి‌ఆర్ క్యాబినెట్‌లో మంత్రిగా పనిచేస్తున్నారు. అయితే కాంగ్రెస్ నుంచి గెలిచి టి‌ఆర్‌ఎస్‌లోకి వెళ్ళి మంత్రి పదవి చేపట్టడంపై కాంగ్రెస్ శ్రేణులు గుర్రుగా ఉన్నాయి. అటు రేవంత్ రెడ్డి సైతం…నెక్స్ట్ సబితా ఇంద్రారెడ్డికి చెక్ పెట్టాలని ప్రయత్నిస్తున్నారు.

ప్రస్తుతం జరుగుతున్న రాజకీయ పరిణామాల్లో సబితాకు మహేశ్వరంలో కాస్త వ్యతిరేకత పెరుగుతున్నట్లు కనిపిస్తోంది. పైగా ఈ సీటు కోసం టి‌ఆర్‌ఎస్ నేత తీగల కృష్ణారెడ్డి కాచుకుని కూర్చున్నారు. సబితాని టి‌ఆర్‌ఎస్‌లోకి తీసుకున్న దగ్గర నుంచి తీగల సైలెంట్ అయ్యారు. ఆ మధ్య ఈయనని రేవంత్ కలిశారు. దీంతో తీగల కాంగ్రెస్‌లోకి వెళ్తారని ప్రచారం జరిగింది. ప్రస్తుతానికి ఆయన టి‌ఆర్‌ఎస్‌లోనే ఉన్నారు. కానీ నెక్స్ట్ ఎన్నికల ముందు రాజకీయ సమీకరణాలు మారితే తీగల పరిస్తితిని బట్టి మారిపోయే ఛాన్స్ ఉంది.

ఎందుకంటే మహేశ్వరంలో తీగలకు సొంత బలం ఎక్కువే. అటు చూస్తే ప్రస్తుతం కాంగ్రెస్ ఇంచార్జ్‌గా భాస్కర్ రెడ్డి ఉన్నారు. ఈయన దూకుడుగానే పనిచేస్తున్నారు. అలాగే బి‌జే‌పి తరుపున శ్రీరాములు యాదవ్ పనిచేస్తున్నారు. ఇక్కడ బి‌జే‌పికి కాస్త ఓటు బ్యాంక్ ఉంది. కాకపోతే టి‌ఆర్‌ఎస్-కాంగ్రెస్‌ల మధ్యే మెయిన్ పోటీ ఉంటుంది. ఏదేమైనా ఈ సారి మహేశ్వరంలో సబితమ్మ కారు స్పీడుకు హస్తమే బ్రేకులు వేసేలా ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news