ఏపీలో అధికార వైసీపీ, టిడిపి నేతల మధ్య మాటల యుద్ధమే కాదు..చేతల యుద్ధం కూడా నడుస్తుంది. రెండు పార్టీల మధ్య గొడవలు విపరీతంగా జరుగుతున్నాయి. ఎన్నికల సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో ఈ రచ్చ మరింత పెరుగుతుంది. అయితే వైసీపీ అధికారంలో ఉండటంతో..ఆ పార్టీ డామినేషన్ పూర్తిగా ఉంటుంది. టిడిపి వాళ్లపై కేసులు ఎక్కువగానే వస్తున్నాయి. అయినా టిడిపి వాళ్ళు తగ్గడం లేదు. ఇటు వైసీపీ వాళ్ళు తమ సత్తా ఏంటో చూపిస్తున్నారు.
ఈ క్రమంలోనే వినుకొండ నియోజకవర్గంలో వైసీపీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు, టిడిపి మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు మధ్య వార్ ఓ రేంజ్ లో నడుస్తుంది. తాజాగా ఈ వార్ మరింత ఎక్కువైంది. వినుకొండలో రెండు వర్గాలు కొట్టుకునే వరకు వెళ్ళాయి.వీరు ఆగకపోవడంతో పోలీసులు సైతం గాలిలో కాల్పులు జరపాల్సిన పరిస్తితి వచ్చింది. అంటే ఏ స్థాయికి గొడవ వెళ్ళిందో అర్ధం చేసుకోవచ్చు.
వినుకొండ టౌన్ లో నల్లజెండాలు ధరించి..బొల్లాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీసులు వైసీపీకి తొత్తులుగా మారిపోయారని ఆరోపించారు. ఇక టిడిపి ర్యాలీ జరుగుతున్న సమయంలోనే ఎమ్మెల్యే బొల్లా తన అనుచరులతో ఎంట్రీ ఇచ్చారు. తన కారు ర్యాలీలోకి దూసుకొచ్చింది. దీంతో టిడిపి శ్రేణులు అడ్డగించారు. ఆ సమయంలో వైసీపీ శ్రేణులు ప్రతి ఘటించాయి.
ఇలా రెండు వర్గాలు కర్రలు, రాళ్ళతో దాడి చేసుకున్నాయి. ఎంతసేపటికి కంట్రోల్ కాకపోవడంతో సిఐ సాంబశివరావు గాల్లో ఒక రౌండ్ కాల్పులు జరిపారు. మొత్తానికి రెండు వర్గాలని చెల్లాచెదురు చేశారు. ఈ దాడుల్లో రెండు పార్టీల కార్యకర్తలకు గాయాలు అయినట్లు తెలిసింది. మొత్తానికి వినుకొండలో పెద్ద రచ్చ చేశారు.