తెలంగాణలో హుజూరాబాద్ ఉపఎన్నిక పోరు మొదలైన విషయం తెలిసిందే. ఈ పోరులో పైచేయి సాధించేందుకు ప్రధాన పార్టీలు తీవ్రంగా పోటీ పడుతున్నాయి. ఇంకా ఉపఎన్నికల షెడ్యూల్ రాకపోయినా సరే హుజూరాబాద్ రాజకీయం వేడెక్కింది. అయితే తెలంగాణలో హుజూరాబాద్ ఉపఎన్నిక షెడ్యూల్ విడుదల సమయంలోనే ఏపీలో బద్వేలు ఉపఎన్నికకు కూడా షెడ్యూల్ విడుదల చేస్తారని తెలుస్తోంది.
ఎందుకంటే గత మార్చి నెలలోనే బద్వేలు వైసీపీ ఎమ్మెల్యే వెంకటసుబ్బయ్య అనారోగ్యంతో మరణించారు. దీంతో బద్వేలు ఉపఎన్నిక అనివార్యమైంది. అసెంబ్లీ స్థానం ఖాళీ అయిన ఆరు నెలల్లో ఉపఎన్నిక పెట్టాలి. అంటే ఇప్పటికే బద్వేలు ఖాళీ అయ్యి నాలుగు నెలలు అవుతుంది. దీంతో త్వరలోనే బద్వేలు స్థానానికి ఉపఎన్నిక పెట్టడం ఖాయమని తెలుస్తోంది. అది కూడా తెలంగాణలో హుజూరాబాద్ ఉపఎన్నిక షెడ్యూల్‌తో పాటే జరగొచ్చని తెలుస్తోంది.
అయితే హుజూరాబాద్ మాదిరిగా బద్వేలులో ప్రధాన పార్టీల మధ్య పోరు పెద్దగా ఉండేలా లేదు. ఎందుకంటే ఇక్కడ వార్ వన్‌సైడ్ అయ్యేలా ఉంది. బద్వేలు ముందు నుంచి కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉంది. ఆ తర్వాత కాంగ్రెస్ పరిస్తితి దిగజారడంతో ఇక్కడ వైసీపీ సత్తా చాటుతుంది. గత రెండు ఎన్నికల నుంచి వైసీపీ మంచి మెజారిటీలతో గెలుస్తుంది.
2019 ఎన్నికల్లో వెంకటసుబ్బయ్య దాదాపు 44 వేల ఓట్ల భారీ మెజారిటీతో గెలిచారు. ఇక ఉపఎన్నికలో కూడా వైసీపీకి భారీ మెజారిటీ రావడం ఖాయమని అంటున్నారు. వైసీపీ తరుపున వెంకటసుబ్బయ్య భార్య డాక్టర్ సుధ పోటీ చేయొచ్చని తెలుస్తోంది. ఇక ఇక్కడ టీడీపీ పోటీలో ఉంటుందో లేక, సానుభూతి వల్ల తమకు గెలుపు కష్టమని చెప్పి సైడ్ అవుతుందో తెలియని పరిస్తితి ఉంది. ప్రస్తుతం ఉన్న పరిస్తితుల్లో బద్వేలులో పోటీ చేయకపోవడమే బెటర్ అని టీడీపీ శ్రేణులు అంటున్నాయి. మరి దీనిపై చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.