అమరావతికి నో: కానీ ఈ సారి ఒకటే రాజధాని…?

ఏపీలో రాజధాని అంశంపై అనేక ట్విస్ట్‌లు నడుస్తున్న విషయం తెలిసిందే. జగన్ అధికారంలోకి రాగానే, అమరావతి వల్ల ఉపయోగం లేదని, పైగా ఖర్చు ఎక్కువ అవుతుందని చెప్పి జగన్ మూడు రాజధానుల నిర్ణయాన్ని తీసుకున్న విషయం తెలిసిందే. అమరావతిని శాసనరాజధానిగా మార్చేసి…విశాఖపట్నంని పరిపాలన రాజధానిగా, కర్నూలుని న్యాయ రాజధానిగా చేస్తున్నట్లు రెండేళ్ల క్రితం జగన్ అసెంబ్లీలో ప్రకటించారు. అయితే రెండేళ్లుగా మూడు రాజధానులపై ముందుకెళ్లలేదు. ఒక వైపు మూడు రాజధానుల అంశం కోర్టు పరిధిలో ఉంది. మరోవైపు రాజధాని అమరావతి రైతులు, ప్రజలు రెండేళ్లుగా ఉద్యమం చేస్తూనే ఉన్నారు.

ఇక తాజాగా రాష్ట్రానికి వచ్చిన అమిత్ షా సైతం….ఏపీ బీజేపీ నేతలని అమరావతి రైతులకు మద్ధతు ఇవ్వాలని చెప్పారు. అలాగే వారు అమరావతికి మద్ధతు ఇచ్చారు. అటు హైకోర్టులో కూడా మూడు రాజధానుల బిల్లుని కొట్టేయడం ఖాయమని ప్రచారం జరిగింది. ఈ పరిణామాల నేపథ్యంలో జగన్ ప్రభుత్వం తాజాగా మూడు రాజధానుల బిల్లుని ఉపసంహరించుకుంది. అమరావతిని కాదని అభివృద్ధి వికేంద్రీకరణ పేరుతో తీసుకొచ్చిన పరిపాలన వికేంద్రీకరణ, సీఆర్డీయే రద్దు చట్టాల్లో సాంకేతిక లోపాలున్నాయని గుర్తించి.. వాటిని ఉపసంహరించుకుంటున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది.

అయితే సంబంధిత వర్గాలతో చర్చించి, మరింత పకడ్బందీ బిల్లులతో మళ్లీ ముందుకు వస్తామని జగన్ ప్రభుత్వం తెలిపింది. ఇక ఆ బిల్లులు మళ్ళీ ఎప్పుడు వస్తాయో తెలియదు…ఎలా ఉంటాయో తెలియదు. ఈలోపు రాజధాని అంశం రగులుతూనే ఉండేలా ఉంది. కాకపోతే ఈ సరి వచ్చే బిల్లుల్లో జగన్ ప్రభుత్వం ఒకటే రాజధాని కాన్సెప్ట్‌తో వస్తుందని వైసీపీ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది.

అలా అని అమరావతిని రాజధానిగా కొనసాగించరని, దాన్ని పక్కనబెట్టేసి విశాఖపట్నంని ఏకైక రాజధానిగా చేస్తారని అంటున్నారు. అంటే మూడు రాజధానులని తీసేసి ఒకే రాజధాని పెడతారని..అది కూడా విశాఖపట్నంని ఏకైక రాజధానిగా చేస్తారని అంటున్నారు. మరి చూడాలి జగన్ ప్రభుత్వం…ఏపీ రాజధానిని ఎప్పుడు తేలుస్తుందో.