సామర్లకోట: కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా పుట్టిన తెలుగుదేశం ఆ పార్టీతో దోస్తీ పెట్టుకోవడంపై హోంమంత్రి చినరాజప్ప స్పందించారు. దేశ భవిష్యత్తు కోసమే కాంగ్రెస్ పార్టీతో చంద్రబాబునాయుడు జట్టు కట్టారని చినరాజప్ప వెనుకేసుకొచ్చారు. సామర్లకోటలో మీడియాతో మాట్లాడుతూ..ఏపీకి తీరని అన్యాయం చేసిన బిజేపీకి తగిన బుద్ధిచెప్పడానికే 16 ప్రాంతీయ పార్టీలు ఏకమవుతున్నాయన్నారు. గతంలో ఎన్టీఆర్ కూడా పీవీ నరసింహారావుకు నంద్యాల ఎంపీగా పోటీ చేస్తే మద్దతు పలికారన్నారు. ఏపీలో కాంగ్రెస్‌తో సీట్ల సర్దుబాటుపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. ఆ విషయమై చంద్రబాబు తుదినిర్ణయం తీసుకుంటారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కాంగ్రెస్ ముందుకొచ్చిందన్నారు. ప్రత్యేక హోదాతోపాటు ఏదికావాలన్నా ఇచ్చేందుకు ముందుకొచ్చిందన్నారు. జాతీయ స్థాయిలో బలమైన ప్రతిపక్షం ఉండాలనే కాంగ్రెస్‌తో కలిసినట్లు తెలిపారు. తాము పార్టీని కలపడంలేదని.. కేవలం పొత్తు పెట్టుకొంటున్నామని మాత్రమే వెల్లడించారు.