ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాబోయే ఎన్నికల్లో కచ్చితంగా ఓటమి పాలవుతారని తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. చంద్రబాబు నాయుడు ఢిల్లీలో చక్రం తిప్పుదామని అనుకుంటున్నారని, కానీ అది కాదు కదా.. కనీసం ఏపీలోనూ రాబోయే ఎన్నికల్లో అధికారంలోకి రారని కేటీఆర్ అన్నారు. ఇవాళ కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ… రానున్న ఎన్నికల్లో చంద్రబాబుకు ఓటమి తప్పదని అన్నారు. ఏపీలో పారిశ్రామిక వేత్తలపై ఐటీ దాడులు చేస్తుంటే.. చంద్రబాబుకు ఏమవుతుందని ప్రశ్నించారు. దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లోనూ ఐటీ దాడులు కొనసాగుతున్నాయని, మరి.. ఒక్క చంద్రబాబు నాయుడే ఎందుకు ఉలికిపడుతున్నారని అన్నారు.
హైదరాబాద్‌లో ఆస్తులున్న నేతలను తాము వైసీపీలో చేరమని చెబుతున్న వార్తలు నిజం కాదని కేటీఆర్ అన్నారు. హైదరాబాద్‌లో చంద్రబాబుకు కూడా ఆస్తులున్నాయి కదా.. మరి ఆయన కూడా వైసీపీలో చేరతారా ? అని ఎద్దేవా చేశారు. చంద్రబాబుకు కలలో కూడా సీఎం కేసీఆరే కనిపిస్తున్నారని, అందుకే కలలోనూ కేసీఆర్‌ను ఆయన కలవరిస్తున్నారని అన్నారు. కేంద్రం అన్యాయం చేసిందని చెబుతున్న బాబే స్వయంగా.. తాము నంబర్ వన్ అని చెప్పుకుంటున్నారని.. దానికి అర్థం ఏంటని ప్రశ్నించారు.
రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ కచ్చితంగా 16 ఎంపీ సీట్లు గెలుచుకుంటుందని కేటీఆర్ అన్నారు. తెలంగాణ ప్రజలు ఢిల్లీని శాసించాలి.. అనే నినాదంతో రానున్న ఎన్నికల్లో ప్రజల ముందుకు వెళ్తామని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో రాహుల్ వర్సెస్ మోడీ అనే వాతావరణమే ఉండదని, రెండు పార్టీలకూ పూర్తి స్థాయిలో మెజారిటీ రాదని, హంగ్ ఏర్పడే అవకాశం ఉందని కేటీఆర్ అన్నారు. పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని మార్చి 1వ తేదీ నుంచి ప్రతి నియోజకవర్గంలో సన్నాహక సమావేశాలను నిర్వహిస్తామని కేటీఆర్ తెలిపారు. ఈ క్రమంలో ఎన్నికలు ముగిశాక పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపడుతామని, అనంతరం పార్టీ పదవులను కేటాయిస్తామని కేటీఆర్ స్పష్టం చేశారు.