వై నాట్ 175….గత రెండేళ్లుగా ఏపీలో అధికార వైఎస్ఆర్‌సీపీ వినిపిస్తోన్న నినాదమిది.ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో 175కి 175 సీట్లు గెలవాలన్నది ఆ పార్టీ లక్ష్యంగా పెట్టుకుంది. దీనికోసం పక్కా వ్యూహం, ప్రణాళికతో సీఎం జగన్ మోహన్ రెడ్డి ముందుకెళ్తున్నారు. నియోజకవర్గాల కు ఇంచారుజుల నియామకంతో ఎన్నికల వాతావరణాన్ని తీసుకువచ్చారు. మళ్లీ అధికారం చేపట్టే దిశగా ఎన్నికల్లో గెలుపు కోసం ఇప్పటినుంచే కసరత్తు మొదలుపెట్టేశారు.
కొన్నాళ్లుగా ఎమ్మెల్యేలు,ఇంచార్జిల పనితీరుపై దృష్టి పెట్టిన సీఎం జగన్ ప్రోగ్రెస్ సరిగా లేని స్థానాలకు కొత్తవారిని ఇంచార్జ్ లుగా నియమించారు. వచ్చే ఎన్నికల్లో విజయం దక్కాలంటే ప్రజలకు మరింతగా చేరువ కావడం తప్ప మరో మార్గం లేదని భావించిన సీఎం జగన్ కీలక మార్పులకు శ్రీకారం చుట్టారు. ఎలాంటి మొహమాటం లేకుండా కొత్త వ్యక్తులను తెర మీదకు తెస్తున్నారు.
గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమం జరుగుతున్న సమయంలోనే నాయకుల పనితీరుపై నివేదికలు తెప్పించుకున్నారు జగన్. కొంతమంది నాయకుల పనితీరుపై సీఎం జగన్ అసంతృప్తి వ్యక్తం చేస్తూ పద్ధతి మార్చుకోవాలని అప్పుడే వార్నింగ్ లు కూడా ఇచ్చారు.మారకపోతే పక్కన పెట్టేస్తామని హెచ్చరిస్తూ కొంత గడువు కూడా ఇచ్చారు. అయినా కొంతమంది వ్యవహారం ఇంకా నిర్లక్ష్య ధోరణిలో ఉండటంతో దిద్దుబాటు చర్యలకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. పనితీరు మెరుగుపడని వారి విషయంలో సీఎం జగన్ తుది నిర్ణయాలు తీసుకున్నట్లు సమాచారం.. ఎన్నికలు దగ్గర పడటంతో అభ్యర్ధుల ఎంపికపై అధినేత కసరత్తు వేగవంతం చేసినట్లు వైసీపీ వర్గాలు చెబుతున్నాయి.
కొన్ని రోజులగా నియోజకవర్గాల వారీగా తెప్పించుకున్న నివేదికలపై కీలక నేతలతో చర్చించిన సీఎం జగన్ ఓ నిర్ణయానికి వస్తున్నారని పార్టీ వర్గాల సమాచారం.అందులో భాగంగానే పనితీరు బాగోలేని నేతలకు ఫోన్ చేసి సమాచారం ఇస్తున్నారని చెబుతున్నారు. ఇలా సమాచారం ఇస్తున్న సమయంలో కొంతమంది నాయకులు బయటికి వస్తున్నారని.. మరికొంతమంది మాత్రం విషయం బయటకు పొక్కకుండా పార్టీలోనే కొనసాగేలా నిర్ణయాలు తీసుకుంటున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇలా అధిష్టానం నుంచి ఫోన్ వచ్చిన కేటగిరీలోనే మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి కూడా ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది.. ఆర్కేకు సీటు విషయంలో స్పష్టత ఇవ్వడంతోనే ఆయన పార్టీకి రాజీనామా చేసారనే అంటున్నారు.
వైఎస్సార్ సీపీ అధికారంలోకి రావాలంటే కీలక సంస్కరణలు తప్పనిసరని సీఎం జగన్ భావిస్తున్నారు. అందుకే ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జిల విషయంలో కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పదనే ఆలోచనలో ఉన్నారని తెలిసింది. గతంలోనే 30 మంది అభ్యర్ధులను మార్చాలని సీఎం నిర్ణయం తీసుకున్నారు. తాజాగా ఈ సంఖ్య మరింత పెరిగినట్లు కూడా సమాచారం.ఉమ్మడి జిల్లాల వారీగా అభ్యర్ధుల పనితీరు, ప్రజల్లో స్పందన, సామాజిక వర్గాల ప్రభావంతో పాటు టీడీపీ-జనసేన ప్రభావం ఎలా ఉంటుందనేది అంచనా వేసుకుని అభ్యర్ధుల విసయంలో నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలిసింది.
కొన్ని చోట్ల ప్రస్తుతం ఉన్న అభ్యర్థుల స్థానంలో వేరే సామాజిక వర్గాలకు ప్రాధాన్యం ఇవ్వాలని కూడా సీఎం నిర్ణయించినట్లు తెలిసింది. మంగళగిరి నియోజకవర్గంలో ఈసారి హోరాహోరీ పోరు సాగనుంది. టీడీపీ అభ్యర్థిగా నారా లోకేష్ బరిలో దిగుతున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి ఉన్నారు.. అయితే సీఎం తెప్పించుకున్న నివేదికల ప్రకారం ఆర్కే కు సీటు ఇవ్వడం కంటే బీసీ నాయకులకు సీటు ఇస్తే గెలిచే అవకాశం ఉన్నట్లు తెలిసింది. అందుకే మార్పు జరిగినట్లు చెబుతున్నారు. గతంలోనే టీడీపీ నుంచి వైసీపీలో చేరిన గంజి చిరంజీవి కి మంగళగిరి నియోజకవర్గం బాధ్యతలు ఇచ్చారు. ఇక్కడ సుమారు 70 వేల బీసీ సామాజికవర్గం ఓట్లు ఉండటంతో ఆర్కే కు సీటు ఇవ్వలేమని చెప్పినట్లు తేలిసింది. గాజువాక విషయంలోను గందరగోళం జరగ్గా పెద్దల జోక్యంతో సద్దుమణిగింది.