జగన్‌తో కయ్యం: హుజూరాబాద్ కోసమేనా?

-

కరోనా నేపథ్యంలో తెలంగాణ సీఎం కేసీఆర్ చాలారోజులు ప్రజల మధ్యకు రాని విషయం తెలిసిందే. కరోనా క్రమంగా తగ్గుతున్న నేపథ్యంలో కేసీఆర్ ఒక్కసారిగా లాక్‌డౌన్ ఎత్తేసి ప్రజల మధ్యలో తిరగడం మొదలుపెట్టారు. అలాగే వారితో కలిసి సహపంక్తి భోజనాలు కూడా చేస్తున్నారు. ఇలా ఒక్కసారిగా లాక్‌డౌన్ ఎత్తేసి కేసీఆర్ ప్రజల్లో తిరగడంపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. హుజూరాబాద్ ఉపఎన్నికలో ఓడిపోతామనే భయంతోనే ప్రజల్లోకి వచ్చారని అంటున్నారు.

ఇదే సమయంలో ఇప్పటివరకు పక్కన ఉన్న ఏపీ సీఎం జగన్‌తో సఖ్యతగా ఉన్న కేసీఆర్…ఒక్కసారి రూట్ మార్చారు. కృష్ణా నదిపై జగన్ ప్రభుత్వం అక్రమ కట్టడాలు కడుతుందని ఫైర్ అయ్యారు. రాయలసీమ ఎత్తిపోతల, ఆర్డీఎస్‌ (రాజోలిబండ డైవర్షన్‌ స్కీమ్‌) కుడి కాలువ పనులను అక్రమంగా చేస్తున్నారని అంటున్నారు. ఇక కేసీఆర్ ఇలా మాట్లాడిన వెంటనే తెలంగాణ మంత్రులు సైతం అదే రాగం అందుకున్నారు. ఏపీ ప్రభుత్వం అక్రమ ప్రాజెక్టులు నిర్మిస్తుందని ఫైర్ అయిపోతున్నారు.

ఇక తెలంగాణకు కౌంటర్‌గా ఏపీ నేతలు కూడా రంగంలోకి దిగారు. తాము రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని సక్రమంగానే నిర్మిస్తున్నామని, కృష్ణా ట్రిబ్యునల్‌ కేటాయింపుల్లో రాష్ట్ర విభజన చట్టం ద్వారా హక్కుగా దక్కిన నీటిని వాడుకోవడానికే ఈ ప్రాజెక్టులు చేపట్టామని చెబుతున్నారు. ఏదేమైనా గాని రెండు రాష్ట్రాల మధ్య అయితే మళ్ళీ నీటి యుద్ధం మొదలైందని, కానీ ఇందులో కూడా ఏదో వ్యూహం ఉండే ఉంటుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

టీఆర్ఎస్ నుంచి బయటకొచ్చి బీజేపీలో చేరిన ఈటల రాజేందర్‌కు హుజూరాబాద్‌లో చెక్ పెట్టేందుకే కేసీఆర్ మళ్ళీ పక్క రాష్ట్రంతో నీళ్ళ యుద్ధం మొదలెట్టి ఉంటారని చెబుతున్నారు. అదే హైదరాబాద్‌లో జరిగే ఎన్నికలైతే పక్క రాష్ట్రంతో స్నేహంగా ఉండేవారని, ఇప్పుడు తెలంగాణ ఉద్యమ గడ్డగా పేరొందిన హుజూరాబాద్ ఉపపోరు జరుగుతుంది కాబట్టే, నీటి తగాదాని తెరపైకి తీసుకొచ్చారని అంటున్నారు. మరి చూడాలి ఈ నీటి యుద్ధం ఎంతవరకు వెళుతుందో?

Read more RELATED
Recommended to you

Latest news