ఆ ‘ టచ్ ‘ తో వణికిపోతున్న టీఆర్ఎస్ ? 

-

పరిస్థితులు ఎప్పుడు ఒకేలా ఉండవు. ఓడలు బళ్ళు బళ్ళు ఓడలు అవుతాయి. కానీ పరిస్థితులు ఎప్పుడు తమకు అనుకూలంగానే ఉంటాయని, తమకు ఎదురు ఉండదు అని, తాము తప్ప ఇంకెవరు అధికారం సాధించలేరు అని, ఇలా ఎన్నో ఊహించుకుంటూ ముందుకు వెళ్తున్న తెలంగాణ అధికార పార్టీ టిఆర్ఎస్ కు ఇప్పుడు చోటు చేసుకుంటున్న పరిణామాలు ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. ఒకవైపు ప్రజలు, ప్రభుత్వం పై పెరుగుతున్న వ్యతిరేకత , మరోవైపు రాజకీయ ప్రత్యర్థులు రోజురోజుకు బలం పెంచుకుంటూ సవాలు విసిరే స్థాయికి ఎదగడం, ఇవన్నీ టిఆర్ఎస్ కు ఆందోళన కలిగిస్తున్నాయి. మరీ ముఖ్యంగా చెప్పకుంటే , బిజెపి తెలంగాణలో బలపడుతున్న తీరు తో టిఆర్ఎస్ కు  రాబోయే ఎన్నికల్లో భారీ నష్టం తప్పదనే విషయాన్ని తెలియజేస్తోంది.
టిఆర్ఎస్ లక్ష్యంగా బిజెపి ఇప్పుడు రాజకీయ వ్యూహాలను పన్నుతోంది. ఆ పార్టీకి చెందిన కీలక నాయకులు అసంతృప్త నేతలను గుర్తించి బీజేపీలో చేర్చుకునే వ్యూహానికి తెరతీసింది. ఇప్పటికే కొంతమంది టిఆర్ఎస్ లో చేరిపోగా, మరెంతో మంది చేరేందుకు సిద్ధంగా ఉన్నారనే వార్తలు గుబులు పుట్టిస్తున్నాయి. ఇటీవల జరిగిన గ్రేటర్ ఎన్నికల్లో టిఆర్ఎస్ నుంచి గెలిచిన కార్పొరేటర్లు తమతో నడిచేందుకు సిద్ధంగా ఉన్నారంటూ బండి సంజయ్ వ్యాఖ్యానించిన తర్వాత, కొంతమంది టిఆర్ఎస్ నాయకులు బీజేపీలో చేరడం చర్చనీయాంశంగా మారింది . అది కాకుండా టిఆర్ఎస్ కు చెందిన 30 మంది ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారు అంటూ సంజయ్ వ్యాఖ్యానించడం కలకలం సృష్టిస్తోంది.
సంజయ్ ఆషామాషీగా ఈ వ్యాఖ్యలు చేసి ఉండరు అని,  ఖచ్చితంగా కొంతమంది ఎమ్మెల్యేలు బిజెపిలో చేరేందుకు వ్యూహం పన్నుతున్నారు అని కెసిఆర్ అనుమానిస్తున్నారు. ఇప్పటికే పార్టీకి చెందిన కీలక నాయకులు,  ఎమ్మెల్యేలపైన నిఘా పెట్టినట్లు ప్రచారం జరుగుతోంది. ఒకవైపు టిఆర్ఎస్ పార్టీని బలహీనం చేస్తూనే, మరోవైపు ఇప్పటికే బలహీనంగా ఉన్న కాంగ్రెస్ పార్టీని దెబ్బ తీస్తూ, ఆ పార్టీలోని కీలక నాయకులను బిజెపిలో చేర్చుకునే ప్లాన్ కు శ్రీకారం చుట్టడంతో ఎక్కడ తమను మించిన పార్టీగా బిజెపి బలపడుతుందో అనే భయాందోళనలు ఇప్పుడు టిఆర్ఎస్ అగ్రనేతల్లో పెరిగిపోతున్నాయి. మరీ ముఖ్యంగా బండి సంజయ్ చెప్పిన ఆ టచ్ లో ఉన్న 30 మంది ఎమ్మెల్యేలు ఎవరా అని ఆరా తీస్తున్నారు గులాబీ
బాస్.

 

 

Read more RELATED
Recommended to you

Latest news