ప్రభుత్వ స్థలాల్లో అక్రమ నివాసాలు జప్తు చేసేస్తామన్న సీఎం యోగి యుపీలో మరో పైలెట్‌ ప్రాజెక్టుకి శ్రీకారం

-

రండెసారి ముఖ్యమంత్రి అయ్యాక ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ పాలనలో మరింత దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే మాఫియా,రౌడీయిజాన్ని ఎక్కడికక్కడ అణచివేశారు.నేర శాతాన్ని కూడా తన చర్యలతో గణనీయంగా తగ్గించారు. తాజాగా ప్రభుత్వ స్థలాల ఆక్రమణల నియంత్రణపై ఆయన దృష్టి సారించారు. ఆక్రమణలు ఎక్కువగా మురికివాడల్లో ఉండటాన్ని గుర్తించిన ఆయన ప్రత్యేక సర్వేకి శ్రీకారం చుట్టారు. ప్రభుత్వ ఉద్యోగులతో పాటు సంఘవిద్రోహ శక్తులు ఈ ఆక్రమణల వెనుక ఉన్నారని యోగీ అంచనా వేస్తున్నారు.ఈ నేపథ్యంలో ఆక్రమణల నిర్మూలన ప్రక్రియను లక్నోలో పైలెట్‌ ప్రాజెక్ట్‌గా చేపట్టారు.

YOGI

పేదల అవసరాలను ఆసరాగా చేసుకుని ప్రభుత్వ భూమిలో అక్రమంగా నివాసాలు ఏర్పాటు చేసుకునే సూత్రధారుల ఆస్తులను జప్తు చేసే దిశగా యోగి చర్యలు ప్రారంభించారు. పట్టణాభివృద్ధి శాఖ, డెవలప్‌మెంట్ అథారిటీ, జిల్లా యంత్రాంగం, పోలీసు శాఖల సమన్వయంతో నిర్వహించే ఈ సర్వేలో ప్రభుత్వ గృహాలకు అర్హులైన వారిని కూడా గుర్తిస్తారు. లక్నోలోని గోమతి నది ఒడ్డున అక్రమంగా నివసిస్తున్న వ్యక్తుల గురించి వివిధ శాఖల అధికారులు సమాచారాన్ని సేకరించాలని యోగీ ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. ఇక్కడ విజయవంతమైతే ఇదే ప్రాజెక్టుని రాష్ర్టమంతా అమలు చేసే యోచనలో ఆదిత్యనాథ్‌ ఉన్నారు.

అక్రమ సెటిల్ మెంట్లలో మాఫియాకు సహకరించే శాఖలపై సీఎం ప్రత్యేక దృష్టి సారించారు. అవసరమైతే అలాంటి అధికారులపై ఎఫ్ఐఆర్ నమోదు చేయడమే కాకుండా, నకిలీ పత్రాలు సృష్టించి అక్రమ సెటిల్మెంట్లు చేసే ఉద్యోగులను శాఖాపరంగా మరియు చట్టపరంగా శిక్షిస్తామని ఇది వరకే యోగి హెచ్చరించారు. ఈ ప్రాజెక్ట్‌కి సారథ్యం వహించాలని జిల్లా మేజిస్ట్రేట్‌కు యోగి ఆదేశాలు ఇచ్చారు.నిర్ణీత గడువులోగా సర్వే పూర్తి చేయాలని, నిజమైన లబ్దిదారులకు పునరావాసం కల్పించేందుకు పూర్తి ప్రణాళికను సిద్ధం చేయాలని అన్నారు.

సీఎం యోగి ఆదిత్యనాథ్‌ చేపట్టిన ఈ కార్యక్రమంతో నదులు,కాలువల వెంట ఉండే మురికివాడలకు మహర్దశ పట్టనుంది. సంఘవిద్రోహ శక్తుల చేతిలో నలిగిపోతున్న బలహీన వర్గాలకు శాశ్వతంగా మేలు జరుగనుంది.ఆయా ప్రాంతాల్లో అభివృద్ధి పనులు పెద్ద ఎత్తున జరిగే అవకాశం ఉంది. సీఎం తీసుకువచ్చిన ఈ కార్యక్రమంపై ప్రభుత్వ వర్గాల నుంచి మంచి స్పందన వస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news