ఏలేటి దెబ్బ..ఆదిలాబాద్‌ కాంగ్రెస్‌లో రచ్చ..క్లోజ్ అయినట్లే!

-

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బాగుపడేట్లు లేదు..అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్లు ఆ పార్టీ పరిస్తితి ఉంది. బలమైన నాయకులు ఉన్నారు..బలమైన కార్యకర్తలు ఉన్నారు..ఇలా ఉన్నా సరే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బలపడదు..పైగా నేతల మధ్య కుమ్ములాటలు పార్టీని మరింత దెబ్బతీస్తున్నాయి. ఈ కుమ్ములాటల నేపథ్యంలో తాజాగా సీనియర్ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బి‌జే‌పిలో చేరిపోయారు.

ఇప్పటికే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పార్టీ పరిస్తితి అంతంత మాత్రమే అన్నట్లు ఉంది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా బి‌జే‌పి బలపడింది. దీంతో కాంగ్రెస్ మూడో స్థానానికి వెళ్లిపోయింది. ఇలాంటి పరిస్తితుల్లో ఏలేటి కాంగ్రెస్ పార్టీని వీడటం పెద్ద దెబ్బ అన్నట్లు ఉంది. పైగా ఇక్కడ నేతల మధ్య ఆధిపత్య పోరు ఎక్కువగా ఉంది. ఓ వైపు మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్ సాగర్ రావు పెత్తనం అయిపోయిందని కొందరు నేతలు గగ్గోలు పెట్టేస్తున్నారు. ఆఖరికి ఆయన సొంత సోదరుడు ఆసిఫాబాద్ జిల్లా అధ్యక్షుడు విశ్వ ప్రసాద్ రావు సైతం అసంతృప్తితో ఉన్నారు.

ఇక ప్రేమ్ సాగర్ రావు..ఎక్కడకక్కడ తన వర్గాన్ని పెంచి పోషిస్తున్నారు. దీంతో పలు స్థానాల్లో వర్గ పోరు పెరిగింది. ఆసిఫాబాద్ లో తన వర్గం నేత గా గణేశ్ ని ఎమ్మెల్యేగా బరిలో దింపాలని చూస్తున్నారు. అక్కడ ఆయనకు వ్యతిరేకంగా కొందరు నేతలు ఉన్నారు. సిర్పూర్ లో అసలు కాంగ్రెస్ ఉనికి లేనట్లే ఉంది. బెల్లంపల్లిలో మాజీ మంత్రి గడ్డం వినోద్ మరొకసారి పోటీ చేయాలని చూస్తుంటే..అక్కడ ప్రేమ్ సాగర్ రావు వర్గం నుంచి చిలుముల శంకర్ పోటీకి రెడీ అవుతున్నారు.

మంచిర్యాలలో ప్రేమ్ సాగర్ రావుకు వ్యతిరేకంగా కొందరు నేతలు పావులు కదుపుతున్నారు. చెన్నూరులో బోడ జనార్ధన్ మరోసారి పోటీ చేయాలని చూస్తున్నారు..కానీ అక్కడ కూడా ప్రేమ్ సాగర్ రావు జోక్యం చేసుకుంటున్నారు. మొత్తానికి ఆదిలాబాద్ లో కాంగ్రెస్ పార్టీలో రచ్చ నడుస్తోంది..దీని వల్ల పార్టీకి భారీ నష్టం జరిగేలా ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version