కవితపై కాంగ్రెస్ పోటీ..గెలుపులో ట్విస్ట్ ఉంటుందా?

తెలంగాణలో 12 స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ స్థానాలకు షెడ్యూలు విడుదలైన విషయం తెలిసిందే. ఆదిలాబాద్, వరంగల్, నల్లగొండ, మెదక్ , నిజామాబాద్, ఖమ్మం జిల్లాల నుంచి ఒక్కో ఎమ్మెల్సీ స్థానం ఖాళీ అవ్వగా, కరీంనగర్ , మహబూబ్‌నగర్, రంగారెడ్డి నుంచి రెండేసి ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అయ్యాయి. ఇక వీటికి ఎప్పుడు ఎన్నికలు జరగనున్నాయి. డిసెంబర్ 10న ఎన్నికలు జరగనున్నాయి.

అయితే ఈ స్థానిక కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయకూడదని బీజేపీ డిసైడ్ అయింది. ఎందుకంటే ఆ పార్టీకి ఏ మాత్రం బలం లేదు. కానీ ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ బరిలో దిగుతుంది. అలా అని కాంగ్రెస్‌కు పూర్తి స్థాయిలో బలం లేదు. ప్రస్తుతం 12 స్థానాల్లో ఉన్న బలాబలాలని చూసుకుంటే…12 చోట్ల టీఆర్ఎస్ గెలిచే అవకాశాలు ఉన్నాయి. అయితే ఎన్నికల్లో డబ్బు ప్రభావం పెరగడం, పార్టీ స్థానిక ప్రజాప్రతినిధులు టీఆర్‌ఎస్‌లోకి ఫిరాయించినందున పోటీకి దూరంగా ఉండాలని రాష్ట్ర నాయకత్వం భావించింది. కానీ, స్థానిక నాయకత్వాల ఒత్తిడితో కొన్నిచోట్ల పోటీకి సిద్ధమైంది.

అలాగే ఏదైనా క్రాస్ ఓటింగ్ జరిగితే..తమకు బెనిఫిట్ అవుతుందనే కోణంలో కాంగ్రెస్ ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే ఆ పార్టీ కొన్ని చోట్ల పోటీకి అభ్యర్ధులని దించుతుంది. మెదక్‌ స్థానం నుంచి సంగారెడ్డి డీసీసీ అధ్యక్షురాలు నిర్మలా జగ్గారెడ్డిని, ఖమ్మం నుంచి స్థానిక నేత రాయల నాగేశ్వర్‌రావును కాంగ్రెస్‌ పోటీకి దించుతుంది. అలాగే నల్గొండ నుంచి శ్రీనివాస్ రెడ్డిని, వరంగల్ నుంచి వాసుదేవరెడ్డిని బరిలో దింపుతుంది.

ఇక నిజామాబాద్‌లో టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మహేష్‌కుమార్‌గౌడ్‌ను పోటీకి దింపుతుంది. అయితే నిజామాబాద్‌లో టీఆర్ఎస్ తరుపున కవిత పోటీ చేస్తున్నారు. అయితే నిజామాబాద్‌లో టీఆర్ఎస్‌కు పూర్తి బలం ఉంది కాబట్టి, కవిత గెలుపు నల్లేరు మీద నడకే…కానీ స్థానిక ప్రజాప్రతినిధులు కాస్త క్రాస్ ఓటింగ్ చేస్తే మాత్రం రిజల్ట్ మారిపోయే అవకాశం ఉంది. మరి చూడాలి నిజామాబాద్‌లో ఏమన్నా ట్విస్ట్ ఉంటుందేమో.