ప్యాండమిక్ ఎఫెక్ట్: దారుణంగా పడిపోయిన జననాలు

కొవిడ్-19 భయాందోళనలు వీడనే లేదు. ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోమ్‌లోనే ఉన్నారు. లక్షల మంది ప్రవాసులు స్వరాష్ట్రానికి తిరిగి వచ్చారు. అయినా, కేరళ రాష్ట్రంలో జననాల సంఖ్య దారుణంగా పడిపోయింది. ఈ ఏడాది తొమ్మిది నెలల కాలంలో రికార్డు స్థాయిలో జననాల సంఖ్య పడిపోయినట్లు డేటా స్పష్టం చేస్తున్నది.

గత దశాబ్దకాలంగా కేరళ రాష్ట్రంలో జననాల సంఖ్య నిర్దిష్టంగా తగ్గుతూ వస్తున్నది. కానీ, ఈ ఏడాదిలో మాత్రం ఒక్కసారిగా పడిపోయింది. కొవిడ్-19 మహమ్మారి వ్యాప్తికి ముందు సంవత్సరం 2019లో 4.80 లక్షల జననాలు నమోదవ్వగా, ఆ తర్వాతి సంవత్సరం 4.53 లక్షలకు తగ్గింది. ఈ ఏడాది సెప్టెంబర్ 30 వరకు కేవలం 2.17 లక్షల జననాలు మాత్రమే నమోదైనట్లు రాష్ట్ర జనన, మరణాల రిజిస్ట్రార్ డేటా స్పష్టం చేస్తున్నది.

ఈ ఏడాది మొదటి ఆరు నెలల కాలంలో అతి తక్కువగా ఫిబ్రవరిలో 27,534 జననాలు నమోదవ్వగా, అత్యధికంగా జూన్‌లో 32,699 జననాలు సంభవించాయి. ఆ తర్వాత జూలై, ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో జననాల సగటు 10వేలకు పైగా నమోదవుతూ వస్తున్నది. ఈ సంఖ్య సెప్టెంబర్‌లో 12,227గా నమోదైంది. గత దశాబ్ద కాలంలో అత్యల్ప జననాల సంఖ్య నమోదైన సంవత్సరాలలో ఒకటిగా 2021 నిలిచిపోనున్నట్లు తెలుస్తున్నది. ఇది రాబోయే సంవత్సరాలలో కేరళ జనాభాపై తీవ్ర ప్రభావం చూపనున్నది.

2010లో కేరళ రాష్ట్రంలో 5.46 లక్షల జననాలు నమోదు కాగా, ఆ తర్వాతి ఏడాది 5.60 లక్షలతో జననాల సంఖ్య కొద్దిగా పెరిగింది. ఇక అప్పటి నుంచి జననాల సంఖ్య తగ్గుతూ వస్తున్నది. అయితే, 2016లో కంటే 2017లో కొద్దిగా జననాల సంఖ్య పెరిగింది.

కేరళ రాష్ట్రంలో 98.96శాతం ప్రసవాలు హాస్పిటళ్లలోనే జరుగుతున్నాయి. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో 100శాతం జననాల రిజిస్ట్రేషన్‌ చేస్తున్నది. 2019లో శిశువులు పుట్టిన 21 రోజుల లోపే 87.03శాతం జననాలను నమోదు చేశారు.

కొవిడ్-19 మహమ్మారి విజృంభన ప్రారంభమైన తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఉన్న కేరళ వాసులు స్వరాష్ట్రానికి తిరిగి రావడం ప్రారంభించారు. ఇది 2020, మేలో ప్రారంభం కాగా, గత 13 నెలల కాలంలో 14.63 లక్షల మంది స్వరాష్ట్రానికి తిరిగి వచ్చారు. అత్యధికంగా మధ్య ఆసియా దేశాల నుంచి కేరళ వాసులు తిరిగి వచ్చారు.