నిన్నమొన్నటివరకూ చంద్రబాబుపై వచ్చిన విమర్శలకు ఏమాత్రం తగ్గకుండా.. నేడు కేసీఆర్ విషయంలో కామెంట్లు చేస్తున్నారు కాంగ్రెస్ నేతలు. హస్తిన పెద్దల విషయంలో నాడు తన స్వార్థరాజకీయ, వ్యక్తిగత ప్రయోజనాలకోసం రాష్ట్రానికి అన్యాయం చేశారనే పేరు సంపాదించుకున్న చంద్రబాబులానే… కేసీఆర్ కూడా తన స్వార్థరాజకీయ, వ్యక్తిగత ప్రయోజానాలకోసం తెలంగాణాను తాకట్టుపెడుతున్నారని అంటున్నారు కాంగ్రెస్ నేతలు!
అవినీతి ఆరోపణలు – నోటుకు ఓటు కేసు విషయంలో చీకట్లో చిదంబరాన్ని కలిశారనే కామెంట్లు… నాడు చంద్రబాబు విషయంలో హాట్ టాపిక్. ఇదే ఫాలో అవుతూ… ఏపీ ప్రత్యేక హోదాను మోడీ పాదాల వద్ద చంద్రబాబు తాకట్టుపెట్టారని, కమలంతో స్నేహం కోసం రాష్ట్ర భవిష్యత్తును తాకట్టుపెట్టారని, ఫలితంగా అవినీతి ఆరోపణల నుంచి బయటపడే మార్గాన్ని వెతుక్కున్నారని అప్పట్లో విమర్శలు విపరీతంగా వచ్చాయి.
ఇదే క్రమంలో… కాళేశ్వరం, మిషన్ భగీరథలలో జరిగిన రూ. వేల కోట్ల అవినీతి కుంభకోణాన్ని బయటకు తీయవద్దని బ్రతిమాలుతూ… ఢిల్లీలో మోడీ, అమిత్ షాల కాళ్లు పట్టుకున్నారని కేసీఆర్ పై విమర్శలు చేస్తున్నారు కాంగ్రెస్ నేతలు. ఢిల్లీలో ఒకమాట హైదరాబాద్ లో ఒకమాట మాట్లాడుతూ కేసీఆర్, కేటీఆర్ తమ అవకాశవాద వైఖరిని బయటపెట్టుకుంటున్నారని విమర్శిస్తున్నారు.
విచిత్రం ఏమిటంటే… ఇలా బలంగా వచ్చిన విమర్శలపై నాడు చంద్రబాబు తీవ్రంగా ప్రతిస్పందించిన దాఖాలాలూ లేవు! ఇదే క్రమంలో… నేడు కేసీఆర్, కేటీఆర్ కూడా ఆ విమర్శలకు వారి వారి స్థాయిల్లో ప్రతిస్పందించడం లేదు! జాతీయ మీడియాతో ప్రెస్ మీట్ పెట్టి… రాష్ట్రంలో చేస్తున్న విమర్శలేవీ అక్కడ చేయలేదు! ఈ ప్రవర్తనే… తెలంగాణలో ప్రజానికాన్ని కంఫ్యూజన్ లోకి నెడుతుంది. కాంగ్రెస్ విమర్శలకు బలం చేకూరుస్తుందనే కామెంట్లు వినిపిస్తున్నాయి!