పాలమూరుపై ‘హస్తం’ పట్టు.. ఆ స్థానాల్లో కారు రివర్స్?

ఉమ్మడి పాలమూరు(మహబూబ్‌నగర్) అంటే ఒకప్పుడు తెలుగుదేశం పార్టీకి కంచుకోట అనే చెప్పాలి. అయితే ఈ జిల్లాలో కాంగ్రెస్‌కు కూడా మంచి పట్టు ఉంది. ఏ ఎన్నికలైన రెండు పార్టీలు హోరాహోరీగా తలపడేవి. అయితే రాష్ట్ర విభజన తర్వాత జరిగిన ఎన్నికలు అంటే..2014లో రెండు పార్టీలకు ధీటుగా టీఆర్ఎస్ వచ్చింది. టీఆర్ఎస్ మెజారిటీ సీట్లు దక్కించుకుంది. 2018 ఎన్నికలోచ్చేసరికి టీఆర్ఎస్ సత్తా చాటింది. జిల్లాలో ఉన్న 14 సీట్లలో 13 సీట్లు టీఆర్ఎస్ కైవసం చేసుకుంది.

ఒక కొల్లాపూర్‌లో మాత్రమే కాంగ్రెస్ విజయం సాధించింది. కాంగ్రెస్ నుంచి బీరం హర్షవర్ధన్ రెడ్డి విజయం సాధించారు. కానీ తర్వాత ఆయన…టీఆర్ఎస్‌లోకి వెళ్ళిపోయారు. దీంతో పాలమూరు జిల్లా మొత్తం టీఆర్ఎస్‌లో చేతుల్లోకి వెళ్లింది. ఇలా టీఆర్ఎస్ చేతుల్లోకి వెళ్ళిన పాలమూరు జిల్లాని..హస్తగతం చేసుకోవడానికి హస్తం పార్టీ గట్టిగానే ట్రై చేస్తుంది. పైగా టి‌పి‌సి‌సి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సొంత జిల్లా కూడా ఇదే…దీంతో ఈ జిల్లాపై ఎక్కువ ఫోకస్ చేసి రేవంత్ ముందుకెళుతున్నారు.

ఈ క్రమంలోనే జిల్లాలో మెజారిటీ సీట్లు దక్కించుకోవడమే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. గత ఎన్నికల్లో తన కంచుకోట కొడంగల్‌లో రేవంత్ రెడ్డి ఓటమి పాలైన విషయం తెలిసిందే. వచ్చే ఎన్నికల్లో మళ్ళీ అక్కడ పోటీ చేసి సత్తా చాటాలని రేవంత్ చూస్తున్నారు. ఇప్పటికే కొడంగల్‌లో టీఆర్ఎస్‌పై వ్యతిరేకత పెరిగింది. అలాగే కొల్లాపూర్‌లో జంపింగ్ ఎమ్మెల్యేకు చెక్ పెట్టాలని రేవంత్ చూస్తున్నారు. అందుకే కొల్లాపూర్‌లోని టీఆర్ఎస్ నేతలని కాంగ్రెస్‌లో చేర్చుకుంటున్నారు.

అటు అచ్చంపేటలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజుపై వ్యతిరేకత ఎక్కువగా కనిపిస్తోంది. అలాగే మక్తల్, దేవర్‌కద్ర, జడ్చర్ల, గద్వాల్, కల్వకుర్తి, నాగర్‌కర్నూలు లాంటి నియోజకవర్గాల్లో కారు ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉందని తెలుస్తోంది. ఆ వ్యతిరేకతని ఉపయోగించుకుని సత్తా చాటాలని రేవంత్ చూస్తున్నారు. అదే సమయంలో పాలమూరు జిల్లాలో బీజేపీ కూడా పికప్ అవుతుంది. కొన్ని నియోజకవర్గాల్లో కమలం పార్టీకి గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తానికైతే పాలమూరులో కారు రివర్స్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.