మండలి రద్దు: ఆ నేతలకు కొత్త ఆశలు?

-

మాట తప్పను….మడమ తిప్పను అనేది జగన్ స్లోగన్…కానీ పరిస్తితులని బట్టి మాట తప్పాల్సి వస్తుంది…మడమ తిప్పాల్సి వస్తుంది. ఎందుకంటే రాజకీయాలు ఎప్పుడు ఒకేలా ఉండవు. కాబట్టి రాజకీయాలకు అనుగుణంగా కొన్ని నిర్ణయాలు మార్చుకోక తప్పదు. ఇప్పటికే మద్యపాన నిషేధం లాంటి నిర్ణయాలపై జగన్ ప్రభుత్వం వెనక్కి తగ్గినట్లే కనిపిస్తోంది. ఇక రెండేళ్ల క్రితం జగన్ మూడు రాజధానుల నిర్ణయాన్ని తీసుకున్నారు. కానీ ఇప్పుడు ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. అలాగే ఏడాది క్రితం మండలి రద్దు అన్నారు. ఇప్పుడు దానిపై కూడా వెనక్కి తగ్గారు.

అంటే ఏడాది క్రితం మండలిలో టీడీపీకి మెజారిటీ ఉంది. దీంతో అసెంబ్లీలో ఏ బిల్లు తీర్మానం చేసిన మండలిలో బ్రేక్ పడేది. మూడు రాజధానులకు కూడా అలాగే బ్రేక్ పడింది. దీంతో మండలి ఉండటం శుద్ధ దండగ అని, దాని వల్ల ప్రజాధనం వృధా అవుతుందని చెప్పి జగన్ ప్రభుత్వం మండలి రద్దుకు మొగ్గు చూపారు. అసెంబ్లీలో బిల్లు పెట్టి కేంద్రానికి పంపారు. అయితే అది అక్కడే ఆగిపోయింది. మండలి రద్దు చేయమని వైసీపీ కేంద్రంపై పెద్దగా ఒత్తిడి తీసుకురాలేదు.

పైగా మండలిలో ఇప్పుడు వైసీపీకి మెజారిటీ వచ్చింది. ఛైర్మన్ కూడా వైసీపీ నుంచే అయ్యారు. దీంతో సడన్‌గా మండలి రద్దుపై జగన్ ప్రభుత్వం యూటర్న్ తీసుకుంది. దీంతో ఎమ్మెల్సీలు ఊపిరి పీల్చుకున్నారు. అలాగే మండలి రద్దుతో కొందరు ఎమ్మెల్సీలకు కొత్త ఆశలు చిగురించాయి.

తమని కూడా మంత్రివర్గంలో తీసుకుంటారేమో అని ఆతృతగా ఉన్నారు. ఎలాగో ఏడాది క్రితం పిల్లి సుభాష్, మోపిదేవి వెంకటరమణల చేత ఎమ్మెల్సీ పదవితో పాటు మంత్రి పదవులకు రాజీనామా చేయించి, వారిని రాజ్యసభకు పంపారు. మండలి రద్దు నిర్ణయంతో అలా చేశారు. ఇప్పుడు వెనక్కి తగ్గారు కాబట్టి…ఎమ్మెల్సీలుగా ఉన్న కొందరు నేతలు మంత్రి అయ్యే అవకాశం వస్తుందని చూస్తున్నారు. మహ్మద్ ఇక్బాల్, తోట త్రిమూర్తులు, దువ్వాడ శ్రీనివాస్ లాంటి వారు మంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version