ఆ వైసీపీ నియోజకవర్గ ఇంచార్జులకు కష్టకాలం

-

ప్రకాశం జిల్లాలో అధికార పార్టీ నాయకులకు పదవి గండం పట్టుకుంది. ఇప్పటి వరకూ నియోజక వర్గంలో పెత్తనం చలాయించిన ఆ నాయకులకు…ఇన్ ఛార్జ్ పదవి ఎప్పుడు ఊడుతుందోనన్న టెన్షన్ పట్టుకుంది. దీంతో నియోజక వర్గాల్లో కొత్తగా వచ్చే నాయకులపై అధికార పార్టీలో చర్చ జరుగుతోందట.

ప్రకాశం జిల్లా వైసీపీలో నియోజక వర్గ ఇన్ ఛార్జ్ ల పరిస్థితి దినదినగండం నూరేళ్లు ఆయూష్షు అన్నట్టు ఉందట. ఏడాదిన్నర కాలంగా నియోజక వర్గంలో అధికార పెత్తనం చలాయిస్తున్న నాయకులను పదవి గండం వెంటాడుతోందట. నియోజక వర్గ ఇన్ చార్జ్ పదవి ఎప్పుడు ఊడుతుందోనని నాయకులు టెన్షన్ పడుతున్నారట. గత ఎన్నికల్లో ప్రకాశం జిల్లాలో చీరాల, పర్చూరు, కొండపి, అద్దంకి నియోజక వర్గాల్లో వైసీపీ అభ్యర్థులు ఓటమిపాలయ్యారు. ఎన్నికల్లో ఓటమి చవిచూసినా….పార్టీ అధికారంలోకి రావడంతో నియోజక వర్గంలో అధికార పెత్తనం వీరిదే. అయితే నియోజక వర్గాల్లో నేతల్ని సర్థుబాటు చేసేందుకు అధికార పార్టీ పెద్దలు ప్లాన్ చేస్తున్నారట.

చీరాల నియోజక వర్గంలో వైసీపీ ఇన్ చార్జ్ గా ఆమంచి కృష్ణమోహన్ పని చేస్తున్నారు. అయితే చీరాలలో టీడీపీ నుండి గెలుపొందిన ఎమ్మెల్యే కరణం బలరామ్ వైసీపీకి మద్దతు తెలిపారు. ఆయన కొడుకు కరణం వెంకటేష్ ని వైసీపీలో చేర్చారు. కరణం బలరామ్ వైసీపీకి మద్దతు తెలిపినప్పటి నుండి ఆమంచి, కరణం మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. దీంతో చీరాలలో నాయకుల మధ్య నెలకొన్న విభేదాలకు ముగింపు పలికేందుకు అధికార పార్టీ పెద్దలు ప్లాన్ చేస్తున్నారు. పర్చూరు ఇన్ ఛార్జ్ గా ఆమంచి కృష్ణమోహన్ లేదా ఆయన సోదరుడు ఆమంచి స్వాములు ని పంపేందుకు చర్చలు జరుపుతున్నారట.

అయితే ప్రస్తుతం పర్చూరు ఇన్ ఛార్జ్ గా రామనాధంబాబు పని చేస్తున్నాడు. గత ఎన్నికల్లో వైసీపీ టిక్కెట్ దక్కలేదని అలిగి టీడీపీకి వెళ్లిన రామనాధంబాబు వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత తిరిగి వైసీపీలో చేరారు. చీరాలలో నాయకుల సర్థుబాటు వ్యవహారం రామనాధంబాబు ఇన్ ఛార్జ్ పదవికి ఎసరుపెట్టేలా ఉందట. కొండపి నియోజక వర్గంలో కూడా పరిస్థితి ఇలానే ఉందట.

కొండపి వైసీపీ ఇన్ ఛార్జ్ గా వెంకయ్య పని చేస్తున్నాడు. అయితే కొండపి వైసీపీలో క్యాడర్ రెండు గ్రూపులుగా ఏర్పడ్డారు. నియోజక వర్గంలో వెంకయ్య ఏ కార్యక్రమం తలపెట్టినా రెండు వర్గాలుగా ఉన్న క్యాడర్ తన్నుకు చస్తున్నారు. మరో వైపు కొండపిలో పాగా వేసేందుకు జూపూడి ప్రభాకర్ ప్రయత్నిస్తున్నారట. దీంతో కొండపిలో నియోజక వర్గ ఇన్ ఛార్జ్ ని మార్చేస్తున్నారంటూ వెంకయ్య వ్యతిరేక వర్గం ప్రచారం చేస్తున్నారట. గత ఎన్నికల్లో స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి పాలైన వెంకయ్య కి జూపూడి ఫియర్ పట్టుకుందట. ఇలా మూడు నియోజక వర్గాల్లో వైసీపీ ఇన్ చార్జ్ లను పదవిగండం వెంటాడుతోందట.

ఎన్నికల్లో ఓటమి పాలైనా నియోజక వర్గంలో అధికార పెత్తనం చలాయిస్తున్న ఈ నేతల పొలిటికల్ ఫ్యూచర్ ఎలా ఉండబోతుందో వేచి చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news