కొడాలి నాని, యార్లగడ్డ మధ్య వివాదానికి వంశీ కారణమయ్యారా

-

కృష్ణాజిల్లాలో మారుతున్న రాజకీయ పరిణామాలు స్నేహితులను సైతం శత్రువులుగా మార్చేస్తున్నాయి. మంత్రి కొడాలి నాని, కేడీసీసీ బ్యాంకు ఛైర్మన్ యార్లగడ్డ వెంకట్రావు మధ్య వచ్చిన గ్యాప్‌.. ఇప్పుడు జిల్లాలోనే కాకుండా పార్టీలో కూడా హాట్ టాపిక్‌గా మారింది. అసెంబ్లీ ఎన్నికల ముందు స్నేహితులుగా ఉన్న వీరు వంశీ పార్టీ మార్పుతో వైరీ వర్గాలుగా మారిపోయారు..కొడాలి నాని, యార్లగడ్డ మధ్య వివాదానికి వంశీ కారణమయ్యారా అన్న చర్చ జిల్లాలో హాట్ హాట్ గా నడుస్తుంది.

 

కొడాలి నాని గుడివాడ నుంచి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి ఇప్పుడు మంత్రయ్యారు. కిందటి ఎన్నికల్లో గన్నవరం నుంచి వైసీపీ అభ్యర్థిగా బరిలో దిగిన యార్లగడ్డ వెంకట్రావు మంత్రి నాని స్నేహితుడే. కొడాలి నాని చెప్పడం వల్లే ఎన్ఆర్ఐ యార్లగడ్డ కాస్తా వైసీపీ నేతగా మారారు. అలాంటిది ఇప్పుడు ఇద్దరు మిత్రుల మధ్య మాటలు లేవట. ఒకే కారులో తిరిగిన వారు ఇప్పుడు ముఖాలు కూడా చూసుకోవడం లేదని సమాచారం.

గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి..మంత్రి కొడాలి నానికి కూడా మొదటి నుంచి స్నేహం ఉంది. వేర్వేరు పార్టీలలో ఉన్నా వారి మైత్రి కొనసాగింది. మొన్నటి ఎన్నికల్లో వంశీ చేతిలోనే యార్లగడ్డ ఓడిపోయారు. ఆ ఓటమి ఆయన్ని బాగా కుంగదీసింది. టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న వల్లభనేని వంశీ వైసీపీకి జై కొట్టడంతో మంత్రి కొడాలి నాని కీలక పాత్ర పోషించారు. వంశీని దగ్గరుండి సీఎం జగన్‌ చెంతకు తీసుకెళ్లారు కూడా. అసలే వంశీ చేతిలో ఓడి బాధలో ఉన్న యార్లగడ్డకు ఈ పరిణామాలు అస్సలు రుచించలేదట.

ఎన్నికలు.. కౌంటింగ్‌ సమయంలో యార్లగడ్డ, వంశీల మధ్య నువ్వా నేనా అన్నట్టుగా మాటల తూటాలు పేలాయి. అలాంటి వంశీని మంత్రి కొడాలి నాని కాపు కాయడంపై యార్లగడ్డ మనస్తాపం చెందారు. వంశీ రూటు మార్చిన తర్వాత గన్నవరం వైసీపీ ఇంఛార్జ్‌ పదవిని వదులుకోవడంతోపాటు పార్టీ ఆఫీసును ఖాళీ చేశారు యార్లగడ్డ. రాజకీయాల్లో తనకీ పరిస్థితి రావడానికి మంత్రి కొడాలి నానే కారణమని ఆయన రగిలిపోతున్నారట. వంశీని తీసుకొచ్చే సమయంలో నాని తనకు కనీసం సమాచారం ఇవ్వలేదని సన్నిహితుల దగ్గర ఆవేదన చెందారట.

ఈ పరిణామాలన్ని జరిగి ఏడాది అవుతోంది. అప్పటి నుంచి మంత్రి కొడాలి నాని, యార్లగడ్డ మధ్య మటలు లేవని సమాచారం. గుడివాడలో కొడాలి ఎడ్ల పందాల పోటీలు పెడితే.. పోటీగా కానూరులో ఎడ్ల పందాలను నిర్వహించారు యార్లగడ్డ. దీంతో వీరిని చూసిన వాళ్లు.. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు.. శాశ్వత శత్రువులు ఉండరనడానికి ఉదాహరణగా చెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news