ప్రశాంతంగా ఉండే ఉత్తరాంధ్రలో ఇప్పుడు రాజకీయ యుద్ధమే నడుస్తోంది. అనూహ్యంగా రాజధాని రగడ రగల్చడంతో అక్కడ ప్రధాన పార్టీల మధ్య రాజకీయ యుద్ధం జరుగుతుంది. ఓ వైపు అమరావతిని ఏకైక రాజధానిగా ఉంచాలని చెబుతూ..ఆ ప్రాంత రైతులు, ప్రజలు మూడేళ్లుగా ఉద్యమం చేస్తున్నారు. ఇదే క్రమంలో శ్రీకాకుళంలో ఉన్న అరసవెల్లికి పాదయాత్ర చేస్తున్నారు. అయితే జగన్ ప్రభుత్వం మూడు రాజధానులు అని చెప్పి మూడేళ్లు అయింది.
కానీ రాజధానులు ఏర్పాటు కాలేదు. ఇప్పుడు అనూహ్యంగా విశాఖ పరిపాలన రాజధాని డిమాండ్‌తో వైసీపీ పోరాటం మొదలుపెట్టింది. అధికారంలో ఉంటూ ప్రతిపక్షం మాదిరిగా ఉత్తరాంధ్రలో పోరాటం చేస్తున్నారు. ఉత్తరాంధ్ర వెనుకబడి ఉందని, ఉత్తరాంధ్రకు టీడీపీ ద్రోహం చేస్తుందని మంత్రులు ఫైర్ అవుతున్నారు. నిజానికి ఉత్తరాంధ్ర వెనుకబడి ఉంది..కానీ గత మూడేళ్లుగా వైసీపీ చేసిన అభివృద్ధి పెద్దగా కనిపించడం లేదు.
పైగా ఇప్పుడు మాట్లాడే మంత్రులు…గత ప్రభుత్వాల్లో కూడా పనిచేసారు. మరి అప్పుడు ఉత్తరాంధ్రకు వారు చేసింది ఏంటి అని ప్రశ్నలు వస్తున్నాయి. అయితే ఇప్పుడు పూర్తిగా ఉత్తరాంధ్రలో రాజకీయ లబ్ది పొందడమే లక్ష్యంగా వైసీపీ ముందుకెళుతుంది. ఇక వైసీపీకి కౌంటర్ ఇచ్చి..ఉత్తరాంధ్రని తామే అభివృద్ధి చేశామని చెప్పి, అక్కడ బెనిఫిట్ పొందాలని టీడీపీ ప్రయత్నాలు చేస్తుంది.
తాజాగా ఒకే రోజు వైసీపీ..విశాఖ పరిపాలన రాజధాని అనే నినాదంతో విశాఖ గర్జన ర్యాలీ పెట్టగా, అటు టీడీపీ సేవ్ ఉత్తరాంధ్ర పేరుతో కార్యక్రమం చేసింది. వైసీపీ నుంచి ఉత్తరాంధ్రని కాపాడుకుందాం అనే నినాదంతో టీడీపీ ముందుకెళుతుంది. ఇక అనూహ్యంగా గర్జన ముగిసిన సమయానికి పవన్ కల్యాణ్ విశాఖలో ఎంట్రీ ఇచ్చారు. అక్కడ ప్రజా సమస్యలు తెలుసుకోవడం కోసం జనవాణి కార్యక్రమం పెడుతున్నారు. అలాగే ఎయిర్‌పోర్టుకు వచ్చిన మంత్రులు జోగి రమేష్, రోజా కార్లపై జనసైనికులు దాడి చేశారని చెప్పి..పలువురు జనసేన నేతలని పోలీసులు అరెస్ట్ చేశారు.
మొత్తానికి మూడు పార్టీలు కలిసి విశాఖలో యుద్ధ వాతావరణం సృష్టించారు. ఇలా మూడు పార్టీలు రచ్చ లేపాయి..మరి వీరిలో ఉత్తరాంధ్ర ప్రజల మద్ధతు ఎవరికి అనేది ఎన్నికల సమయంలోనే క్లారిటీ రావాలి. కానీ ప్రస్తుతం పరిస్తితులని చూస్తుంటే అధికారంలో ఉండటం వల్ల వైసీపీ తమ అధికార బలంతో విశాఖ గర్జనని సక్సెస్ చేసుకుంది. కానీ అధికార బలం ప్రజలపై పూర్తిగా పనిచేయదు. విశాఖ రాజధాని డిమాండ్‌తో ప్రజలు పెద్ద స్థాయిలో స్వచ్చందంగా రాలేదనే చెప్పాలి.
ఇటు ఉత్తరాంధ్ర టీడీపీ నేతలు..సేవ్ ఉత్తరాంధ్రతో కార్యక్రమం చేశారు. వారిని ప్రజలు ఎంతవరకు నమ్ముతారో చెప్పలేం. చివరిగా జనసేన అధినేత కోసం పెద్ద ఎత్తున జనసైనికులు వచ్చారు. చెప్పాలంటే మూడు పార్టీలు తమ బలాన్ని ప్రదర్శించాయి. మరి ఈ మూడు పార్టీల్లో ప్రజలు ఎవరిని నమ్ముతారో చూడాలి. చివరికి ఉత్తరాంధ్ర ప్రజలు ఆధిక్యం ఎవరికి ఇస్తారో చూడాలి.