హుజూరాబాద్ ఉపఎన్నికలో ఈటల రాజేందర్‌ని ఓడించడానికి టీఆర్ఎస్ ఎన్ని ప్రయత్నాలు చేసిందో అందరికీ తెలిసిందే. అలాగే ఆయన్ని ఓడించడానికి చాలామంది టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు…హుజూరాబాద్‌లో మకాం వేసి మరీ ప్రచారం చేసి, వెనుక రాజకీయం నడిపారు. కానీ ఎన్ని ప్రయత్నాలు చేసినా ఈటల గెలుపుని ఆపలేకపోయిన విషయం తెలిసిందే. ఈటల మంచి మెజారిటీతో మళ్ళీ ఎమ్మెల్యేగా గెలిచేశారు.
అయితే ఈటల గెలిచాక…ఒక సవాల్ విసిరిన విషయం తెలిసిందే. తనని ఓడించడానికి తిరిగిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేలని సైతం తాను ఓడించడానికి ప్రచారం చేస్తానని, వారి వారి నియోజకవర్గాల్లో బహిరంగ సభలు పెడతానని చెప్పిన విషయం తెలిసిందే. ఇక అందుకు తగ్గట్టుగానే ఈటల తన యాక్షన్ ప్లాన్ రెడీ చేసుకున్నట్లు తెలుస్తోంది. మొదట తన సొంత జిల్లా కరీంనగర్‌లోని కారు ఎమ్మెల్యేలపై ఫోకస్ చేశారట.
కరీంనగర్ కారు పార్టీకి బలమైన కంచుకోట..ఈ కంచుకోటని కూల్చాలని ఈటల ఫిక్స్ అయ్యారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే పలు నియోజకవర్గాలపై ఈటల ఫోకస్ పెట్టినట్లు సమాచారం. చొప్పదండి ఎమ్మెల్యే రవిశంకర్ హుజురాబాద్‌లో ప్రచారం చేసి తనను ఓడించేందుకు చేసిన ప్రయత్నాలకు రిటర్న్ గిఫ్ట్‌గా ఆయన్ను ఓడించేందుకు ఈటల ఇప్పటి నుంచే ప్రయత్నాలు చేస్తున్నట్లు టాక్ వస్తోంది. ఇక్కడ బీజేపీ టిక్కెట్ మాజీ ఎమ్మెల్యే బొడిగ శోభకు ఇప్పించి, రవికి చెక్ పెట్టాలని చూస్తున్నారు. అటు వేములవాడ సీటు తన సన్నిహితురాలు తుల ఉమకు ఇప్పించాలని చూస్తున్నారు. ఈటలతో పాటు ఉమ కూడా టీఆర్ఎస్ వదిలి బీజేపీలో చేరిన విషయం తెలిసిందే.
ఇక మెయిన్ టార్గెట్ మంత్రి గంగుల కమలాకర్…ఈయన హుజూరాబాద్‌లో ఎలాంటి రాజకీయం చేశారో అందరికీ తెలిసిందే. గంగులపై బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి. అలాగే మరో మంత్రి కొప్పుల ఈశ్వర్‌కు చెక్ పెట్టాలని ఈటల చూస్తున్నారు. గత ఎన్నికల్లో ధర్మపురి నుంచి కేవలం 400 ఓట్ల మెజారిటీతో గెలిచిన ఈశ్వర్‌పై వివేక్ పోటీ చేసే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. ఇలా ప్రతిచోటా కారు ఎమ్మెల్యేలకు చెక్ పెట్టి కంచుకోటగా ఉన్న కరీంనగర్‌లో కమలం పాగా వేసేలా ఈటల ప్లాన్ చేస్తున్నారు.