ఈటల రాజేందర్ .. జగన్‌ని కూడా ఇరుకున పెట్టారా?

-

ఈటల రాజేందర్ (Etela Rajender) …ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా ఉన్న పేరు. మొన్నటివరకు కేసీఆర్ కుడిభుజంగా ఉన్న ఈటల…అనూహ్య పరిణామాల మధ్య టీఆర్ఎస్ నుంచి బయటకొచ్చారు. ఇక బయటకొచ్చాక కొన్ని రోజులు రాష్ట్రంలో రాజకీయ పరిస్తితులని నిశితంగా గమనించి తాజాగా బీజేపీలో చేరిపోయారు.

ఈటల రాజేందర్ | Etela Rajender

అయితే ఊహించని విధంగా ఈటల తన ఎమ్మెల్యే పదవికి సైతం రాజీనామా చేశారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో హుజూరాబాద్ నియోజకవర్గానికి ఉపఎన్నిక జరగనుంది. ఇక ఆ పోరులో గెలుపు ఎవరిది అనే విషయాన్ని పక్కనబెడితే, పార్టీ మారుతూ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఈటల రాజేందర్ కొత్త ట్రెండ్ తీసుకొచ్చారు. ఇప్పటికివరకు పార్టీలు మారిన ఎమ్మెల్యేలు ఎవరు తమ పదవులకు రాజీనామా చేయలేదు.

టీఆర్ఎస్‌లో 12 మంది కాంగ్రెస్, ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు జాయిన్ అయ్యారు. కానీ వారు పదవులకు రాజీనామా చేయలేదు. ఇక ఈటల రాజీనామా చేసి కేసీఆర్‌ని ఓ రకంగా ఇరుకున పెట్టారనే చెప్పొచ్చు. ఇదే సమయంలో పక్కనే ఉన్న ఏపీ సీఎం జగన్‌ని సైతం ఇరుకున పెట్టారని చెప్పొచ్చు. ఎందుకంటే ఏపీలో సైతం నలుగురు టీడీపీ ఎమ్మెల్యేలు వైసీపీ వైపుకు వచ్చారు.

అయితే జగన్ మొదట నుంచి తన పార్టీలోకి వచ్చేవారు పదవులకు రాజీనామా చేసి రావాల్సిందే అని రూల్ పెట్టిన విషయం తెలిసిందే. అలాగే పలువురు వైసీపీలో చేరేవారు తమ పదవులకు రాజీనామా చేసి వెళ్లారు. కానీ టీడీపీని వీడిన నలుగురు ఎమ్మెల్యేలు పదవులకు రాజీనామా చేయకుండా డైరక్ట్‌గా వైసీపీలో చేరకుండా జగన్ ప్రభుత్వానికి మద్ధతు ఇచ్చారు.

అంటే అనధికారికంగా వారు వైసీపీ ఎమ్మెల్యేలుగా ఉన్నట్లే. అయితే ఇంతకాలం వారు వైసీపీ వైపుకు వచ్చిన ఎమ్మెల్యే పదవులకు మాత్రం రాజీనామా చేయించలేదు. ఒకవేళ రాజీనామా చేసి ఉపఎన్నికలు వచ్చిన వైసీపీ గెలుపుకి పెద్ద ఇబ్బంది కూడా ఉండదు. కానీ జగన్ మాత్రం టీడీపీ ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయించడం లేదు. మరి ఈటల ఎపిసోడ్‌తో అయిన రెండు రాష్ట్రాల సీఎంలు పార్టీలోకి వచ్చిన ఇతర ఎమ్మెల్యేల చేత రాజీనామాలు చేయిస్తారేమో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news