టీఆర్ఎస్ నుంచి బయటకొచ్చేసి హుజూరాబాద్ బరిలో నిలబడిన మాజీ మంత్రి ఈటల రాజేందర్ ( Etela Rajender )ని టీఆర్ఎస్ అభ్యర్ధి ఎవరు అనే అంశం బాగా టెన్షన్ పెడుతున్నట్లే కనిపిస్తోంది. ఎందుకంటే ఈటల ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరిపోయారు. పదవికి రాజీనామా చేయడంతో హుజూరాబాద్ ఉపపోరు జరగనుంది. ఆ ఉపపోరులో ఈటల బీజేపీ నుంచి నిలబడుతున్నారు.
అయితే అధికార టీఆర్ఎస్ నుంచి ఎవరు బరిలో ఉంటారనే అంశం ఆసక్తికరంగా మారింది. ఇప్పుడు క్యాస్ట్ ఈక్వెషన్స్ బట్టి రాజకీయం ఉంటుంది. ఈటల రాజేందర్ బీసీ వర్గానికి చెందిన వ్యక్తి. అలాగే ఈటల భార్య రెడ్డి వర్గానికి చెందిన వ్యక్తి. దీంతో బీసీలు, రెడ్డిల మద్ధతు తనకు ఎక్కువగానే ఉంటుందని ఈటల భావిస్తున్నారు. కానీ టీఆర్ఎస్ నుంచి ఏ కులానికి చెందిన వ్యక్తి బరిలో ఉంటారు. అప్పుడు క్యాస్ట్ ఈక్వెషన్స్ ఎలా మారుతాయో అంశంపై ఈటల ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది.
కాకపోతే టీఆర్ఎస్ మాత్రం అభ్యర్ధి విషయంలో ఇంకా క్లారిటీ ఇవ్వడం లేదు. కాసేపు రెడ్డి వర్గానికి చెందిన నాయకుడుని నిలబెడతారని,ఆ తర్వాత బీసీ అభ్యర్ధి అని, కాదు కాదు ఎస్సీ వర్గానికి చెందిన వ్యక్తి ఈటల మీద పోటీ చేస్తారని ప్రచారం జరుగుతుంది. ఈ క్రమంలోనే ఎస్సీ వర్గానికి చెందిన వ్యక్తి బరిలో దింపే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. మాజీ మంత్రి ముద్దసాని దామోదర్ రెడ్డి సతీమణి ముద్దసాని మాలతి పేరును సీఎం పరిశీలిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
అయితే మాలతి దళిత సామాజికవర్గం కావడం, ఆమె భర్త రెడ్డి సామాజికవర్గానికి చెందినవారు కావడంతో హుజూరాబాద్ బరిలో క్యాస్ట్ ఈక్వెషన్స్ త్వరగా మారేలా కనిపిస్తున్నాయి. ఇలా మాలతిని బరిలో పెడితే ఇటు ఎస్సీ ఓట్లు, అటు రెడ్డి ఓట్లు పడటానికి ఛాన్స్ ఉందని తెలుస్తోంది. అయితే త్వరగా అభ్యర్ధి ఎవరో తేలితే, దాని బట్టి తాను రాజకీయ వ్యూహాలు వేయొచ్చని ఈటల చూస్తున్నారు. మరి చూడాలి హుజూరాబాద్ పోరులో టీఆర్ఎస్ తరుపున ఎవరు నిలబడతారో?