వినేవాడు ఉండాలే గాని…రాజకీయ నాయకులు ఎన్ని అయినా చెబుతారు…రాజకీయాల్లో ప్రత్యర్ధి నేతలు చెడ్డవాళ్లు అని, తామే మంచి వాళ్ళమని నాయకులు చెప్పుకుంటారు. కానీ ఏది నమ్మాలి ఏది నమ్మకూడదనేది జనం ఆలోచించుకోవాలి. అయితే ఇప్పుడు తెలంగాణలో జరగబోయే మునుగోడు ఉపఎన్నికలో గెలవడానికి ప్రధాన పార్టీలు గట్టిగా పోటీ పడుతున్నాయి. ఇక ఈ ఉపఎన్నికలో గెలవడానికి ప్రత్యర్ధులని నెగిటివ్ చేసి…తమకు పాజిటివ్ పెంచుకోవాలని ఎవరికి వారు ప్రయత్నిస్తున్నారు.
బీజేపీ మతతత్వ పార్టీ అని, కేంద్ర ప్రభుత్వం అన్నీ ధరలు పెంచేసి ప్రజలని ఇబ్బంది పెడుతుందని, కాబట్టి బీజేపీకి ఓటు వేయకూడదని…ఎంతో అభివృద్ధి చేస్తున్న తమకే ఓటు వేయాలనేది టీఆర్ఎస్ కాన్సెప్ట్. ఇక తెలంగాణ వచ్చాక ప్రజలు బాగుపడలేదని, కేవలం కేసీఆర్ కుటుంబం మాత్రమే బాగుపడిందని బీజేపీ చెబుతుంది.
అలాగే కేసీఆర్ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని, కుటుంబ పాలన, అవినీతి పాలన అంతమొందించాలంటే బీజేపీని గెలిపించాలని అంటున్నారు. అటు ఇప్పటివరకు టీఆర్ఎస్-బీజేపీలకు ఛాన్స్ ఇచ్చారు కదా…ఈ ఒక్క ఉపఎన్నికలో తమకు ఛాన్స్ ఇవ్వాలని కాంగ్రెస్ అంటుంది. అంటే ఇక్కడ ఎవరికి వారు ప్రజలు ఓట్లు దక్కించుకోవడానికి పయత్నిస్తున్నారు. కానీ ఇందులో ఎవరిని ప్రజలు నమ్ముతారో చూడాలి.
అయితే ఎవరికి వారు ప్రజలని నమ్మించే పనిలో పడ్డారు. ఇదే క్రమంలో తాజాగా టీఆర్ఎస్ నేత, శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు మరీ విడ్డూరంగా ఉన్నాయి. పార్టీలు మారే రాజకీయ నాయకులను ప్రజలు నమ్మరని, ఓట్లు వేయరని అన్నారు. వరుసగా పార్టీలు మారుతూ వచ్చిన గుత్తా లాంటి వారు ఇలాంటి లాజికల్ మాటలు మాట్లాడితే ప్రజలు నమ్మే పరిస్తితుల్లో ఉండరని చెప్పొచ్చు.
అసలు అంతకంటే ముఖ్యంగా ఇతర పార్టీల నుంచి వచ్చిన ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ లో ఎంతమంది ఉన్నారో చెప్పాల్సిన పని లేదు. ఏ మాత్రం నైతిక విలువలు పాటించకుండా ఇతర పార్టీ గుర్తులతో గెలిసిన ఎమ్మెల్యేలని టీఆర్ఎస్ తీసుకుంది. కానీ బీజేపీ విలువలు పాటిస్తూ…పార్టీలో వారి చేత ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయించి తీసుకుంటున్నారు. కాబట్టి ప్రజలు ఎవరు మాటలు నమ్ముతారో అర్ధం చేసుకోవచ్చు.