హుజూరాబాద్ ఉపఎన్నికలో మంత్రి హరీష్ రావు క్లియర్‌గా ఉందని చెప్పొచ్చు. ఈటల రాజేందర్‌కు చెక్ పెట్టడానికి ఆయన కేవలం బిజేపినే టార్గెట్ చేస్తున్నారు. బిజేపినే టార్గెట్ చేసి, ఈటలని ఓడించాలని హరీష్ చూస్తున్నట్లు తెలుస్తోంది. హుజూరాబాద్‌లో ఈటల, హరీష్‌ల మధ్య ఏ రేంజ్‌లో మాటల యుద్ధం జరుగుతుందో చెప్పాల్సిన పని లేదు. కేసిఆర్ ఎన్ని చేసిన హుజూరాబాద్‌లో తనదే విజయమని ఈటల గట్టిగానే చెబుతున్నారు. అలాగే కేసిఆర్ లేదా హరీష్‌ల్లో ఎవరైనా తనపై పోటీ చేసి గెలవాలని సవాల్ విసురుతున్నారు.
అయితే ఇక్కడ ఈటల ఒంటరి పోరాటం చేస్తున్నారని చెప్పొచ్చు. బిజేపి తరుపున పోటీ చేస్తున్నా కూడా, ఆ పార్టీ ప్రస్తావన ఎక్కువ తీసుకురావడం లేదు. కనీసం మోదీ బొమ్మని ప్రచారంలో వాడటం లేదు. అటు కాషాయ రంగుని కూడా ఎక్కువ కనబడనివ్వడం లేదు. ఎందుకంటే కేంద్రంలో అధికారంలో ఉన్న బిజేపిపై ప్రజల్లో వ్యతిరేకత ఉంది. ఇప్పటికే పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలు పెంచి పేదలపై పెనుభారం మోపారు. దీంతో నిత్యావసర ధరలు ఆకాశాన్ని అంటాయి.
పైగా రోడ్లు, రైల్వే స్టేషన్లు, కరెంట్ లైన్లు అమ్మేయడానికి సిద్ధమవుతున్నారు. ఇలా చాలా అంశాలపై బిజేపి మీద ప్రజలకు పీకల్లోతు కోపం ఉంది. కానీ ఈ వ్యతిరేకతని తన మీద పడకుండా, కేవలం తన వ్యక్తిగత ఇమేజ్‌తోనే ఈటల, హుజూరాబాద్‌లో ప్రచారం చేస్తున్నారు. అందుకే హరీష్…ప్రత్యేకంగా బిజేపినే టార్గెట్ చేస్తున్నారు. కేంద్రంలో ఉన్న బిజేపిపై విమర్శలు గుప్పిస్తున్నారు. అంటే జనంలో బిజేపి మీద ఉన్న వ్యతిరేకతని ఈటలపైకి షిఫ్ట్ చేసే ప్రయత్నాలు చేస్తున్నట్లు కనిపిస్తోంది.
అందుకే పదే పదే హరీష్…బిజేపిని టార్గెట్ చేసి ఈటలకు చెక్ పెట్టాలని చూస్తున్నారు. కేంద్రాన్ని అడిగి ఈటల నిధులు తీసుకురాలేరని, టిఆర్‌ఎస్‌ని గెలిపిస్తేనే అభివృద్ధి జరుగుతుందనే కోణంలో ప్రచారం చేస్తున్నారు. మరి హరీష్ టార్గెట్‌కు ఈటల ఎంతవరకు చెక్ పెడతారో చూడాలి.