ఈటలకు పవన్ సపోర్ట్…బి‌జే‌పి లైట్ తీసుకుందా?

రెండు తెలుగు రాష్ట్రాల్లో పవన్ కల్యాణ్‌కు ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన బయటకొస్తే చాలు, ప్రజలు పెద్ద ఎత్తున వస్తారు. అయితే అంత క్రేజ్ ఉన్న పవన్ కల్యాణ్‌ని బి‌జే‌పి పెద్దగా ఉపయోగించుకున్నట్లు కనిపించడం లేదు. పొత్తులో ఉండి కూడా తెలంగాణ బి‌జే‌పి నాయకత్వం పవన్‌ని లైట్ తీసుకుంటున్నట్లు కనిపిస్తోంది. ఏపీలో ఎలాగో పవన్ సపోర్ట్ వదులుకోవాలని బి‌జే‌పి అనుకోవడం లేదు.

etela-rajender | ఈట‌ల‌ రాజేందర్
etela-rajender | ఈట‌ల‌ రాజేందర్

కానీ తెలంగాణలో మాత్రం బి‌జే‌పి…పవన్‌ అవసరం పెద్దగా లేదు అన్నట్లుగానే భావిస్తుంది. పైగా తెలంగాణలో సొంతంగా బలపడే సత్తా ఉందని బి‌జే‌పి నాయకత్వం భావిస్తుంది. అందుకే పవన్ సపోర్ట్ తీసుకుంటున్నట్లు కనిపించడం లేదు. పైగా హుజూరాబాద్ ఉప ఎన్నికలో ఈటల గెలుపు కోసం పవన్‌ని రంగంలోకి దింపి ప్రచారం చేయించాలని ఆలోచనలో కూడా ఉన్నట్లు లేరు.

ఇప్పుడు హుజూరాబాద్ ఉపఎన్నిక బి‌జే‌పికి ఎంత ప్రతిష్టాత్మకమో చెప్పాల్సిన పని లేదు. ముఖ్యంగా ఈటల రాజేందర్‌కు. ఇలాంటి సమయంలో పవన్ లాంటి వారు ప్రచారంలోకి దిగితే ఇంకా బి‌జే‌పికే అడ్వాంటేజ్ అవుతుంది. కానీ బి‌జే‌పి మాత్రం, పవన్‌ని ప్రచారానికి ఆహ్వానించే పరిస్తితి కనబడటం లేదు. గత ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో పవన్‌తో వచ్చిన విభేదాలు ఇంకా కొనసాగుతున్నట్లే కనిపిస్తున్నాయి.

ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో జనసేనకు పెద్దగా విలువ ఇవ్వడం లేదని చెప్పి పవన్ కల్యాణ్, బహిరంగంగా హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ టి‌ఆర్‌ఎస్ అభ్యర్ధి అయిన మాజీ ప్రధాని పి‌వి నరసింహారావు కుమార్తె సురభి వాణీదేవిని గెలిపించాలని కోరారు. అయితే బి‌జే‌పి నుంచి గట్టి పోటీ ఎదురుకున్న వాణీ చివరికి విజయం సాధించింది. ఇక ఇక్కడ నుంచి పవన్‌ని బి‌జే‌పి దూరం పెడుతూ వస్తుంది. పవన్ కూడా తెలంగాణ బి‌జే‌పి నేతలతో టచ్‌లో లేరు. మరి హుజూరాబాద్ ఉప ఎన్నిక సమయంలో బి‌జే‌పి నేతలు పవన్ మద్ధతు కోరతారో లేదో చూడాలి.