హుజూరాబాద్ వార్: బ్యాలెట్ తప్పదా?

తెలంగాణ రాజకీయాల్లో హుజూరాబాద్ ( Huzurabad ) ఉపపోరు రోజుకో మలుపు తిరుగుతుంది. ఈ ఉపఎన్నికలో ఎవరు గెలుస్తారో తెలియదు గానీ, ఈ ఉపపోరులో ఎంతమంది నామినేషన్స్ వేస్తారనేది ఇప్పుడు సస్పెన్స్‌గా మారిపోయింది. మామూలుగా ప్రధాన పార్టీల అభ్యర్ధులతో పాటు కొంతమంది ఇండిపెండెంట్ అభ్యర్ధులు ఎన్నికల బరిలో ఉంటారు. కానీ తెలంగాణలో కొన్నిసార్లు విచిత్రాలు జరుగుతుంటాయి.

Huzurabad | హుజురాబాద్
Huzurabad | హుజురాబాద్

ఎవరైనా తమ నిరసనని తెలియజేయాలంటే ఎన్నికల్లో నామినేషన్స్ వేసి నిరసన తెలియజేస్తున్నారు. గతంలో పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా నిజామాబాద్ పార్లమెంట్ స్థానంలో పెద్ద సంఖ్యలో పసుపు రైతులు నామినేషన్స్ వేసి, కొత్త చరిత్ర సృష్టించారు. అంటే అధికార టీఆర్ఎస్‌పై నిరసనగా రైతులు ఆ విధంగా నామినేషన్స్ వేశారు. అందుకు తగ్గట్టుగానే ఆ ఎన్నికల్లో కేసీఆర్ కుమార్తె కవిత ఓటమి పాలయ్యారు.

అయితే హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో కూడా కొందరు తమ నిరసనని తెలియజేయడానికి సిద్ధమవుతున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో ఉన్న ఫీల్డ్ అసిస్టెంట్లు తమని తక్షణమే ఉద్యోగాలకు తీసుకోవాలని, లేదంటే హుజూరాబాద్‌లో నామినేషన్స్‌ వేస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. అలాగే ఎం‌పి‌టి‌సిలు సైతం నామినేషన్స్  వేయడానికి సిద్ధమవుతున్నారు. ఎంపిటిసిలకు నిధులు కేటాయించకుండా ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని, అందుకే ప్రభుత్వానికి తమ సత్తా తెలిసేలా హుజురాబాద్ ఉప ఎన్నికల్లో ఎనిమిది వందల మంది ఎంపీటీసీలు ఎన్నికల బరిలోకి దిగుతామని హెచ్చరిస్తున్నారు.

తాజాగా సిరిసిల్ల జిల్లాలో మిడ్ మానేరు నిర్వాసితులు, ముంపు గ్రామాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ, మిడ్ మానేరు ఐక్య వేదిక ఆందోళనకు దిగింది. తమకు న్యాయం జరగకపోతే, ఊరుకు పది మంది చొప్పున హుజూరాబాద్‌లో నామినేషన్స్ వేస్తామని అంటున్నారు. మరి తమ డిమాండ్లని నెరవేర్చుకోవడానికి ఇలా నామినేషన్స్ వేస్తామని మాట్లాడుతున్నవారు, నిజంగా నామినేషన్స్ వేస్తే, హుజూరాబాద్ ఉపఎన్నిక ఈవీఎంలతో జరగడం కష్టమే. ఇక ఇక్కడ బ్యాలెట్‌తోనే ఎన్నిక నిర్వహించాల్సి ఉంటుంది. మరి చూడాలి చివరికి హుజూరాబాద్‌లో ఎంతమంది నామినేషన్స్ వేస్తారో?