కాంగ్రెస్ కు కొత్త పీసీసీ చీఫ్ గా నియమితుడైన రేవంత్ రెడ్డి revanth reddy రాకతో హుజురాబాద్ ఉప ఎన్నికల పరిస్థితులు పూర్తిగా మారేలా కనిపిస్తున్నాయి. రేవంత్ రెడ్డి రాకతో కాంగ్రెస్ శ్రేణుల్లో నూతన ఉత్తేజం కనిపిస్తోంది. ఇన్ని రోజులు ఇక్కడ టీఆర్ఎస్ , బీజేపీల మధ్యే ప్రధానంగా పోటీ ఉంటుందని భావించగా… అది తప్పని నిరూపిస్తూ… రేవంత్ రెడ్డి కూడా రంగంలోకి దిగనున్నారని తెలుస్తుంది. ఇంకా అధికార టీఆర్ఎస్ అభ్యర్థిని ప్రకటించలేదు. కాంగ్రెస్ కు నియోజకవర్గ ఇంచార్జిగా ఉన్న పాడి కౌశిక్ రెడ్డి పోటీలో ఉంటాడని కొంత మంది అంటుండగా… రేవంత్ రెడ్డి మదిలో పొన్నం ప్రభాకర్ పోటీ ఆలోచన కూడా మెదులుతున్నట్లు సమాచారం.
ఇక తాజాగా టీడీపీని వీడి టీఆర్ఎస్ లోకి చేరుతున్న ఎల్. రమణ కూడా ఈటల రాజేందర్ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తే కావడం గమనార్హం. ఇక్కడ టీఆర్ఎస్ తరఫున ఎల్. రమణ పోటీ చేస్తాడని ప్రచారం జరుగుతోంది. కాగా ఇప్పటికే ప్రచారంలో దూకుడు పెంచిన బీజేపీ , టీఆర్ఎస్ లు కాంగ్రెస్ టీపీసీసీ అధ్యక్షుడు కూడా బరిలోకి దిగుతున్నాడని తెలిసి మరింతలా స్పీడను పెంచాయి.
అభ్యర్థిని ప్రకటించకపోయినా… అధికార టీఆర్ఎస్ నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న మండలాలకు ఇంచార్జులను ప్రకటించిన ప్రచారంలో దూకుడు కనబరుస్తోంది. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మంత్రులు చాలా మంది ఇప్పటికే హుజురాబాద్ నియోజకవర్గంలో పర్యటించి ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. మరో పక్క సోషల్ మీడియాలో కూడా వార్ పెరిగింది. మీ హయాంలో చేసిన అభివృద్ధి ఏంటి అని బీజేపీ నేతలు ప్రశ్నిస్తుంటే కేంద్రం నుంచి హుజురాబాద్ నియోజకవర్గానికి ఏం నిధులు తెచ్చారని టీఆర్ఎస్ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఇలా పరస్పర ఆరోపణలతో హుజురాబాద్ రాజకీయం రోజురోజుకూ వేడెక్కుతోంది.