వైఎస్సాఆర్సీపీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి, తెలంగాణ సీఎం కేసీఆర్ కలిస్తే తప్పేంటి? అని ప్రశ్నించారు మాజీ కేంద్ర మంత్రి కిల్లి కృపారాణి. ఏపీ అభివృద్ధి చెందాలంటే వైఎస్ జగన్, కేసీఆర్ కలవాల్సిందేనని ఆమె స్పష్టం చేశారు. సుదీర్ఘ చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం టీడీపీ కనుసన్నల్లో నడుస్తోందని ఆమె ఆరోపించారు. ప్రత్యేక హోదాపైన రాహుల్ గాంధీ మాటలను నమ్ముతున్న చంద్రబాబు ఎందుకు యూపీఏలో చేరడం లేదని ఆమె నిలదీశారు. కాంగ్రెస్ లో జరుగుతున్న పరిణామాలు తనను బాధించడం వల్లే ఏపీ సంక్షేమం కోసం వైసీపీలో చేరుతున్నట్టు ఆమె ప్రకటించారు.
కిల్లి కృపారాణి.. వైసీపీలో చేరుతున్నట్టు ఇదివరకే ప్రకటించిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ లోని లోటస్ పాండ్ లో ఆమె జగన్ ను కలిశారు. ఈనెల 28న కిల్లి కృపారాణి… వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్సాఆర్సీపీలో చేరనున్నారు. ఆమెకు శ్రీకాకుళం ఎంపీ టికెట్ ఇవ్వడానికి వైఎస్ జగన్ సుముఖంగా ఉన్నట్టు సమాచారం.