మాజీ మంత్రిని ముక్కు.. నేలకు రాస్తావా అంటూ….

-

హుజురాబాద్ నియోజకవర్గంలో రాజకీయాలు రంజుగా మారాయి. వైద్య మంత్రి ఈటల రాజేందర్ తన పదవికి, టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయడంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యం అయింది. టీఆర్ఎస్ కు రాజీనామా చేసిన అనంతరం మాజీ మంత్రి రాజేందర్ కాషాయ గూటికి చేరిపోయారు. ఇక్కడ ప్రస్తుతం జరుగుతున్న ఉప ఎన్నికలో ఈటల రాజేందర్ కు టీఆర్ఎస్ కు తీవ్ర పోటీ ఉండనుంది. ఎలక్షన్ నోటిఫికేషన్ కూడా వెలువడక ముందే ఇక్కడ ఇరు పార్టీలు చేస్తున్న ప్రచారం, సెగలు పుట్టిస్తోంది. తాజాగా మాజీ మంత్రి ఈటల రాజేందర్ హుజురాబాద్ నియోజకవర్గంలో దొంగ ఓట్లు ఉన్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇంతకీ ఆయన ఏమన్నారంటే..

ఉప ఎన్నికల్లో తనను ఓడించాలని టీఆర్ఎస్ కుట్రలు చేస్తోందని మాజీ మంత్రి ఆరోపించడం గమనార్హం. ఏకంగా రెవెన్యూ అధికారుల సహాయంతోటే నియోజకవర్గంలో దొంగ ఓట్లు క్రియేట్ చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. అంతే కాకుండా అధికార టీఆర్ఎస్ కు ఓట్లు వేయని వారి ఓటు హక్కును తొలగిస్తున్నారని కూడా ఆరోపించారు. ఇదంతా అధికార పార్టీ నేతల ఇళ్లలోనే జరుగుతోందంటూ బాంబు పేల్చారు. అంతే కాకుండా ఇందుకు తన వద్ద ఆధారాలు కూడా ఉన్నాయని అన్నారు. హుజురాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ రాధిక ఇంట్లో అక్రమంగా 34 ఓట్లు నమోదు చేశారని దుయ్యబట్టారు.

మరో పక్క ఆయన పోలీసులపై కూడా విరుచుకుపడ్డారు. నియోజకవర్గంలో పోలీసుల తీరు సరిగ్గా లేదని దీనిపై రాష్ర్ట డీజీపీకి త్వరలోనే ఫిర్యాదు చేస్తామని తెలిపారు. ఈటల రాజేందర్ చేసిన దొంగ ఓట్ల ఆరోపణలను హుజురాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ రాధిక ఖండించారు. తమ ఇంట్లో దొంగ ఓట్లు ఉంటే… తాను స్థానిక హనుమాన్ ఆలయంలో ముక్కు నేలకు రాస్తానని.. ఒక వేళ దొంగ ఓట్లు కాకపోతే ఈటల రాజేందర్ ముక్కు నేలకు రాస్తాడా అని సవాల్ విసిరారు.

Read more RELATED
Recommended to you

Latest news