నల్గొండలో స్వీప్..కాంగ్రెస్‌కు సాధ్యమేనా?

-

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నిదానంగా రేసులోకి వస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటివరకు బి‌జే‌పి కాస్త హడావిడి చేయడం వల్ల..కాంగ్రెస్ రేసులో వెనుకబడింది. పైగా కే‌సి‌ఆర్ సైతం బి‌జే‌పినే టార్గెట్ చేస్తూ రాజకీయం చేయడం, అటు కేంద్రంలో అధికారంలో ఉండటంతో రాష్ట్రంలో బి‌జే‌పి నేతలు దూకుడుగా రాజకీయం చేయడం వల్ల..రాజకీయ యుద్ధం బి‌ఆర్‌ఎస్, బి‌జేపిల మధ్య జరుగుతున్నట్లు కనిపించింది. కానీ రాష్ట్రంలో క్షేత్ర స్థాయిలో బి‌జే‌పి కంటే కాంగ్రెస్ పార్టీకి బలం ఎక్కువ ఉంది.

కాకపోతే పార్టీలో అంతర్గత సమస్యల వల్ల ఇబ్బందులు పడింది. కానీ నిదానంగా ఆ సమస్యలు తగ్గుతున్నాయి. కాంగ్రెస్ బలపడుతుంది. ఇటీవల పక్కనే ఉన్న కర్నాటకలో కాంగ్రెస్ గెలవడంతో..తెలంగాణలో ఆ పార్టీకి కాస్త ఊపు వచ్చింది. ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ నేతలు దూకుడుగా రాజకీయం చేయడం మొదలుపెట్టారు. ఇక తమ కంచుకోటలపై నేతలు ఫోకస్ పెట్టారు. ఇదే సమయంలో కాంగ్రెస్ కంచుకోటగా ఉన్న ఉమ్మడి నల్గొండలో ఈ సారి సత్తా చాటుతామని అక్కడి నేతలు చెబుతున్నారు.

ఈ సారి నల్గొండలో స్వీప్ చేస్తామని కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి లాంటి వారు అంటున్నారు. మరి కాంగ్రెస్ నేతలు అన్నట్లు నల్గొండలో కాంగ్రెస్ స్వీప్ చేస్తుందా? అంటే చెప్పడం కష్టమే. గత రెండు ఎన్నికల్లో ఇక్కడ కాంగ్రెస్ గట్టిగా దెబ్బతింది. ఇప్పుడు అక్కడ ఒక్క సీటు కూడా కాంగ్రెస్‌కు లేదు. అన్నీ సీట్లు బి‌ఆర్‌ఎస్‌కే ఉన్నాయి.

కాకపోతే నిదానంగా బి‌ఆర్‌ఎస్ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత రావడం, కాంగ్రెస్ నేతలు బలపడుతుండటంతో సీన్ మారుతుంది. జిల్లాలో మొత్తం 12 సీట్లు ఉన్నాయి. దేవరకొండ, నాగార్జున సాగర్, హుజూర్‌నగర్, కోదాడ, నల్గొండ, సూర్యపేట, ఆలేరు. తుంగతుర్తి, మునుగోడు, నకిరేకల్, భువనగిరి, మిర్యాలగూడ సీట్లు ఉన్నాయి. అయితే కొన్ని సీట్లలోనే కాంగ్రెస్ పార్టీకి లీడ్ కనిపిస్తుంది. మొత్తానికైతే ఇక్కడ బి‌ఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య హోరాహోరీ పోరు జరగనుంది. మరి ఈ సారి నల్గొండ లో లీడ్ ఎవరికి వస్తుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news