కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడం ఓకే గాని.. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడం మాత్రం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి పెద్దగా ఇష్టం లేదనే చెప్పొచ్చు.. బీజేపీ అధిష్టానం ఒత్తిడితో రాజీనామా చేశారు తప్ప.. స్వతహాగా వచ్చిన ఆలోచనతో రాజీనామా చేయలేదని చెప్పొచ్చు. అందుకే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన సరే పదే పదే అదే అంశంపై రాజగోపాల్ మాట్లాడుతున్నారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడం రిస్క్ అని తెలిసినా.. ప్రజా సంక్షేమం కోసం చేశానని చెబుతున్నారు.
అంటే ప్రజల కోసం రాజీనామా చేశానని, ఇప్పుడు ప్రజల మద్ధతు తనకు కావాలన్నట్లు రాజగోపాల్ చెబుతున్నారు. వాస్తవానికి ప్రజా సంక్షేమం కోసమని ఛెబుతున్నా సరే.. కోమటిరెడ్డి రాజీనామా చేయడానికి అసలు కారణం బీజేపీ అధిష్టానం ఒత్తిడి అనే సంగతి అందరికీ తెలుసు. ఉమ్మడి నల్గొండలో బీజేపీకి పెద్ద బలం లేదు.. కోమటిరెడ్డి లాంటి వారిని లాగి బలపడాలనేది బీజేపీ ప్లాన్. అందుకు తగ్గట్టుగానే రాజగోపాల్ రెడ్డిని లాగింది.
అదే సమయంలో ఒక పార్టీ తరుపున గెలిచిన ఎమ్మెల్యేని, ఆ పార్టీతో పాటు, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయించి బీజేపీలోకి తీసుకుంటే టీఆర్ఎస్ పార్టీకి గట్టి కౌంటర్ ఇచ్చినట్లు అవుతుందనేది అధిష్టానం కాన్సెప్ట్. ఎందుకంటే కేసీఆర్ చాలామంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలని…పదవులకు రాజీనామా చేయకుండా టీఆర్ఎస్ లోకి తీసుకున్నారు. ఇలా చేయడం వల్ల రాజకీయంగా విలువ ఉండదు.
అందుకే బీజేపీ విలువలు పాటిస్తూ…రాజగోపాల్ చేత…ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయించారు. అయితే ఇలాంటి పరిస్తితుల్లో రాజీనామా చేయడం రాజగోపాల్ రెడ్డికి రిస్క్ ఎక్కువ. మళ్ళీ ఉపఎన్నికలో పోటీ చేయడానికి ఆర్ధికంగా భారం పడుతుంది. పైగా బలంగా ఉన్న టీఆర్ఎస్, కాంగ్రెస్ లని ఢీకొట్టడం చాలా కష్టమైన పని. హుజూరాబాద్ ఉపఎన్నిక అంటే ఓ ప్రత్యేక పరిస్తితుల్లో వచ్చింది. కానీ మునుగోడు అలా కాదు. అందుకే రాజగోపాల్..ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడం పెద్ద రిస్క్ అని పదే పదే చెబుతున్నారు. మరి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడం రిస్క్ అవునో కాదో మునుగోడు ఫలితం వచ్చాకే తెలుస్తోంది.