మొదట నుంచి కాంగ్రెస్ పార్టీలో రెబల్ మాదిరిగా ముందుకుపోతున్న సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి..పార్టీ మారుతున్నారా? ఆయనకు బిఆర్‌ఎస్ లో సీటు ఫిక్స్ అయిందా? అంటే తాజాగా వస్తున్న సమాచారం ప్రకారం చూస్తే అవుననే పోలిటికల్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. అందుకే సంగారెడ్డిలో పాత బిఆర్‌ఎస్ నేతలు..జగ్గారెడ్డికి సీటు ఇవ్వవద్దని బిఆర్‌ఎస్ అధిష్టానం వద్ద మొరపెట్టుకుంటున్నారు.
చింతా ప్రభాకర్‌కే మళ్ళీ సీటు ఇవ్వాలని కోరుతున్నారట. కానీ బిఆర్‌ఎస్ అధిష్టానం ఏం చేస్తుందనేది పెద్ద ప్రశ్నగా మారింది. అయితే జగ్గారెడ్డి గతంలో కూడా బిఆర్‌ఎస్ లో పనిచేశారు. అసలు 2004లో తొలిసారి బిఆర్‌ఎస్ నుంచి పోటీ చేసి సంగారెడ్డి బరిలో గెలిచారు. తర్వాత ఆయన కాంగ్రెస్ లోకి జంప్ చేశారు. 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి విజయం సాధించారు. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి..బిఆర్‌ఎస్ అభ్యర్ధి చింతా ప్రభాకర్ చేతిలో ఓడిపోయారు. 2018 ఎన్నికల్లో జగ్గారెడ్డి విజయం సాధించారు.
ఇక ఈయన కాంగ్రెస్ లోనే ఉంటూ..కాంగ్రెస్ పార్టీపైనే విమర్శలు చేస్తూ వస్తున్నారు. టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని ఏ స్థాయిలో టార్గెట్ చేస్తున్నారో తెలిసిందే. అలాగే కేటిఆర్ తో సన్నిహితంగా ఉంటూ సంగారెడ్డిలో పనులు చేసుకుంటున్నారు. దీంతో జగ్గారెడ్డి పార్టీ మారతారని ఎప్పటినుంచో ప్రచారం జరుగుతూ వస్తుంది. కానీ ఆయన ఖండిస్తూ వచ్చారు. ఇప్పుడు ఏకంగా బిఆర్‌ఎస్ లో సీటు ఫిక్స్ అయిందని టాక్ నడుస్తోంది.
కానీ ఇప్పుడు జగ్గారెడ్డి బయటకొచ్చి ఖండించడం లేదు. పైగా ఆయనకు సీటు ఇవ్వవద్దని బిఆర్‌ఎస్ నేతలు..హరీష్‌కు మొరపెట్టుకున్నారు. దీని బట్టి చూస్తే జగ్గారెడ్డికి బిఆర్ఎస్ సీటు ఖాయమైందని తెలుస్తోంది. మరి అధికారికంగా ప్రకటన ఎప్పుడు వస్తుందో చూడాలి.