కేసీఆర్‌ను సమస్యలు కమ్ముకుంటున్నాయా?

-

హీరోలు జీరోలవ్వడం, ఓడలు బండ్లవ్వడం సమాజంలో ఇటువంటి ఘటనలు జరుగుతూనే ఉంటాయి. హీరోలు ఎప్పటికి హీరోలుగా ఉండడం ఎప్పటికీ కుదరదు. ఈ సూత్రం సినీమాలోనే కాదూ.. రాజకీయాల్లో సైతం వర్తిస్తుంది. ప్రస్తుతం తెలంగాణలో కేసీఆర్ పరిస్థితికి ఈ సూత్రం సరిగ్గా వర్తిస్తుంది.

గడిచిన కొద్దికాలంగా కేసీఆర్‌కు దెబ్బమీద దెబ్బ పడుతోంది. తెలంగాణలో లోక్ సభ ఎన్నికలు బీఆర్ఎస్‌ను మరోసారి చావుదెబ్బ కొట్టాయి. 17 స్థానాల్లో కనీసం ఒక్క చోట కూడా కారు పార్టీ విజయం సాధించలేకపోయింది. దానితో పార్టీ భవిష్యత్తు ఆగమ్యగోచరమైంది. గత నవంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన బీఆర్‌ఎస్‌.. ఈ ఎన్నికల్లో కనీస పోటీ ఇవ్వకపోగా 17ఎంపీ స్థానాల్లో 16 నియోజకవర్గాల్లో ఒక్కదానిలో కూడా బోణీ కొట్టలేకపోయింది. మెదక్‌లోనే కాస్తా పోటీ ఇచ్చింది. ఇక మిగతా స్థానాల్లో అభ్యర్థులు చేతులెత్తేశారు. టీఆర్‌ఎస్‌ ఆవిర్భావం తర్వాత ఒక్క ఎంపీ సీటును సైతం సొంతం చేసుకోలేకపోవడం ఇదే తొలిసారి.

2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితోనే కేసీఆర్‌ను సమస్యలు కమ్ముకోవడం మొదలైంది. ఎన్నికల్లో ఓటమి మాములే అయినా కేసీఆర్ ప్రబలవిరోధి అయిన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవటాన్ని

తట్టుకోలేకపోతున్నారు. అందుకనే రేవంత్ సీఎం అయినదగ్గర నుండి కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోతుందని కేసీయార్, కేటీయార్, హరీష్ రావు ప్రతిరోజు నానా రచ్చచేస్తున్నారు. తమ హయాంలో జరిగిన తప్పిదాలను కూడా రేవంత్ ప్రభుత్వం ఖాతాలో వేసేసి నానా రకాలుగా ఆరోపణలు, విమర్శలు గుప్పిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఏపీలో జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి రాబోతున్నట్లు జోస్యం కూడా చెప్పారు. అయితే అందుకు భిన్నంగా జగన్ దారుణంగా ఓడిపోయారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతుండటాన్ని కేసీయార్ ఏమాత్రం జీర్ణించుకోలేకపోతున్నారంటే అతిశయోక్తికాదు.

ఇక.. మరోవైపు కేసీఆర్ బద్దవిరోధి అయిన చంద్రబాబు ఏపీలో అధికారంలోకి వచ్చారు. అలాగే కేంద్రంలో నరేంద్ర మోదీ మూడోసారి ప్రధానిగా బాధ్యతలు తీసుకోబోతున్నారు. టెలిఫోన్ ట్యాపింగ్ కేసులో తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్న కేసీయార్ తాజాగా కోర్టు స్పందించిన తీరుతో మరింత ఇబ్బందులో పడబోతున్నారు. ట్యాపింగ్ వ్యవహారంలో కేసీయార్ ను అరెస్టుచేసి విచారించాలని మంత్రులు, కాంగ్రెస్ నేతలు ఎప్పటినుండో డిమాండ్ చేస్తున్నారు. పదేళ్ళలో జరిగిన అవినీతి, అక్రమాలకు తోడు ట్యాపింగ్ విషయంపై రేవంత్ సీరియస్ యాక్షన్ తీసుకోవాలని అనుకుంటే చాలు కేసీయార్ ఇబ్బందుల్లో పడటం ఖాయం. తెలంగాణాలో రేవంత్, ఏపీలో చంద్రబాబు, కేంద్రంలో మోదీ ముగ్గురికి ముగ్గురూ కేసీయార్ కు బద్ధశతృవులనే చెప్పాలి. అందుకనే ఏరూపంలో కేసీయార్ ను సమస్యలు ఎప్పుడు చుట్టుముడుతాయో ఎవరు చెప్పలేకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news