పాతబస్తీ ఎంఐఎం పార్టీ అడ్డా అని చెప్పవచ్చు. ఎన్ని రాజకీయ పార్టీలు పోటీలో ఉన్న అక్కడ మాత్రం ఎంఐఎం వన్ సైడ్ గా గెలవాల్సిందే. రాష్ట్రంలో ఏ పార్టీ గాలి ఉన్నా సరే పాతబస్తీ పరిధిలో ఉండే నియోజకవర్గాల్లో ఎంఐఎం గాలి ఉంటుందని చెప్పవచ్చు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉండే స్థానాల్లో 7 స్థానాల్లో ఎంఐఎంకే రిజర్వ్ అయ్యాయనే చెప్పవచ్చు. ఆ స్థానాల్లో ఎంఐఎంని ఓడించడం జరిగే పని కాదు.
పైగా ఆ ఏడు స్థానాల్లో అధికార బిఆర్‌ఎస్ పార్టీ పోటీని లైట్ తీసుకుంటుంది. ఎలాగో గెలవడం కష్టం కాబట్టి..పరోక్షంగా ఆ పార్టీకి సహకారం అందిస్తూ ఉంటుంది. మిగిలిన ముస్లిం ప్రభావ ప్రాంతాల్లో ఎంఐఎం పరోక్షంగా బిఆర్‌ఎస్ పార్టీకి మద్ధతు ఇస్తూ ఉంటుంది. ఇలా రెండు పార్టీలు పరోక్షంగా మిత్రపక్షాలుగా ముందుకెళుతున్నాయి. అయితే ఈ సారి ఎన్నికల్లో తాము ఎక్కువ స్థానాల్లో పోటీ చేస్తామని, ప్రతిసారి తమకు 7 సీట్లు ఉన్నాయని అంటున్నారని, అందుకే ఈ సారి 50 స్థానాల్లో పోటీ చేసి కనీసం 15 స్థానాలు గెలుచుకుని అసెంబ్లీలో అడుగుపెడతామని అక్బరుద్దీన్ ఓవైసీ తాజాగా అసెంబ్లీలో కేటీఆర్ తో సవాల్ చేసిన విషయం తెలిసిందే.
సవాల్ చేశారు గాని ఎంఐఎం 15 సీట్లు గెలవడం కష్టం..పైగా ఎన్ని సీట్లలో పోటీ చేస్తే అన్నీ సీట్లలో ఓట్లు చీలి బిఆర్‌ఎస్ పార్టీకి నష్టం జరుగుతుంది. అయితే ఈ సారి ఎంఐఎం తనకున్న 7 సీట్లని హోల్డ్ చేస్తుందా? అంటే చేస్తుందనే చెప్పవచ్చు. ఎంఐఎంకి ఉన్న ఏడు సీట్లు..మలక్ పేట, చాంద్రాయణగుట్ట, ఛార్మినార్, నాంపల్లి, యాకుత్ పురా, బహదూర్ పురా, కార్వాన్.. దాదాపు ఈ 7 సీట్లని ..మళ్ళీ గెలిచే ఛాన్స్ ఉంది..కాకపోతే అందులో ఒక నాంపల్లి సీటులో కాస్త డౌట్ ఉంది.
గత ఎన్నికల్లోనే అక్కడ తక్కువ మెజారిటీతో ఎంఐఎం గెలిచింది. కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్..ఎంఐఎంకు గట్టి పోటీ ఇచ్చారు. గత మూడు ఎన్నికల్లో ఆయన పోటీ చేసి ఎంఐఎంపై ఓడిపోతున్నారు. దీంతో ఆయనపై ఈ సారి సానుభూతి ఉంది. ఈ సారి ఆయన గట్టిగా కష్టపడితే నాంపల్లిలో ఎంఐఎంని నిలువరించవచ్చు. అప్పుడు ఎంఐఎంకి ఒక సీటు తగ్గుతుంది. కానీ ఇప్పుడు కాంగ్రెస్ పరిస్తితి చూస్తే నాంపల్లి గెలవడం ఈజీ కాదని చెప్పవచ్చు. చూడాలి మరి ఈ సారి నాంపల్లి ఎవరికి దక్కుతుందో.