జిల్లా మొత్తం తన కనుసన్నల్లో శాసిస్తానని చెప్పిన మంత్రి అనిల్ కుమార్.. చేతులు ఎత్తేశారా? జిల్లాలో తన ప్రమేయం కారణంగా రెచ్చిపోతున్న కొందరు నేతలను ఆయన అదుపు చేయలేకపోతున్నారా? అంటే.. ఔననే అంటున్నారు పరిశీలకులు. ఒక్క విశ్లేషకులే కాదు.. పార్టీలో నేతలు సైతం.. ఇదే మాట చెబుతున్నారు. అనిల్‌ను ఎంతో అనుకున్నాం.. కానీ, ఆయన వల్ల కావడం లేదు. ఇక్కడ పంచాయతీలు పెరుగుతున్నాయే తప్ప.. తగ్గడం లేదు! అని వారు చెబుతున్నారు. గత ఏడాది ఎన్నికలకు ముందు ఎంతో ప్రశాంతంగా ఉన్న నెల్లూరులో.. ఎన్నికల తర్వాత ముఖ్యంగా అనిల్ మంత్రి అయిన తర్వాత పరిణామాలు ఒక్కసారిగా మారిపోయాయి.
రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వైసీపీ నేతలు సీనియర్లు కావడంతో తమ పెత్తనం సాగాలనే ధోరణిని అవలంబించారు. అయితే, అనిల్ మాత్రం అధికారులను తన కనుసన్నల్లో నడిపించారు. అయితే.. ఇది ఎంతో కాలం నడవలేదు. రెడ్డి వర్గంలో తిరుగుబాటు వచ్చినంత పనైంది. ఆనం రామనారాయణ రెడ్డి నుంచి సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాని గోవర్థన్‌రెడ్డి వరకు ఎవరివారు కూటములు ఏర్పాటు చేసుకుని మంత్రి పెత్తనాన్ని ఎదిరించడం ప్రారంబించారు. ఇక, తన వల్ల కాదనుకున్నారో.. ఏమో.. అనిల్ సైలెంట్ అయిపోయారు.
ఇదే విషయం జగన్ దగ్గర ప్రస్థావనకు వచ్చినప్పడు జిల్లాను నడిపించే బాధ్యతను మరోమంత్రి మేకపాటి గౌతం రెడ్డికి అప్పగించారు. అయితే.. ఆయన కూడా మౌనంగా అంగీకరించినా.. చేసేదేమీ లేదని గ్రహించి తన పనితాను చేసుకుని పోతున్నారు. ఇటీవల కాకానిపై కొన్ని ఆరోపణలు వచ్చాయి. టీడీపీ నాయకులు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అయితే.. వీటి వెనుక మంత్రి అనిల్ ఉన్నారనే ప్రచారం జరిగింది. దీంతో ఇది మరింత వివాదంగామారిపోయింది. వెంటనేజోక్యం చేసుకున్న అనిల్ తన ప్రమేయం లేదని వివరణ ఇచ్చుకున్నారు.
అంతకుముందు జరిగిన ఘటనలకు సంబంధించి మాత్రం ఇంత వేగంగా ఆయన రియాక్ట్ కాలేదు. ఇప్పుడు మాత్రం వెంటనే స్పందిచారు. దీనిని బట్టి రెడ్డి వర్గం దూకుడుదే పైచేయి అయిందని.. అనిల్ ఇక చేతులు ఎత్తేశారని అంటున్నారు పరిశీలకులు. మొత్తానికి నెల్లూరులో రెడ్డి వర్గం ముందు అనిల్ చేతులు ఎత్తేసినట్టేనా? లేక పుంజుకుంటారా? అనేది చూడాలి.