టెక్కలిలో అచ్చెన్నకు బ్రేకులు..దువ్వాడతో డౌటే?

-

ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గం అంటే టీడీపీకి కంచుకోట అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎక్కువసార్లు టెక్కలిలో టీడీపీ జెండా ఎగిరింది. ఇక 2014, 2019 ఎన్నికల్లో ఇక్కడ వరుసగా కింజరాపు అచ్చెన్నాయుడు గెలుస్తూ వస్తున్నారు. అయితే అంతకముందు హరిశ్చద్రపురం(నియోజకవర్గాల పునర్విభజనకు ముందు) స్థానంలో మూడుసార్లు గెలిచారు. ఆ తర్వాత 2009 ఎన్నికల్లో టెక్కలికి వచ్చారు. ఆ ఎన్నికల్లో అచ్చెన్న ఓటమి పాలయ్యారు.ఇక 2014, 2019 ఎన్నికల్లో విజయం సాధించారు. టి‌డి‌పి అధికారంలో ఉండగా మంత్రిగా చేసిన విషయం తెలిసిందే. 2019 ఎన్నికల్లో టి‌డి‌పి ఓడిపోయి ప్రతిపక్షానికి పరిమితమైన సరే అచ్చెన్న దూకుడు తగ్గలేదు.

పైగా ఆయన అరెస్ట్ అయి జైలుకెళ్లి వచ్చాక ఇంకా దూకుడుగా రాజకీయం చేస్తున్నారు. అదే సమయంలో ఏపీ టి‌డి‌పి అధ్యక్ష పదవి దక్కింది. దీంతో తనదైన శైలిలో అచ్చెన్న ముందుకెళుతున్నారు. అధికార వైసీపీపై గట్టిగానే పోరాడుతున్నారు. ఇలా దూకుడుగా ఉన్న అచ్చెన్నకు ఎలాగైనా చెక్ పెట్టాలని చెప్పి జగన్ ప్రయత్నిస్తున్నారు. అందుకే టెక్కలిపై ఫోకస్ పెట్టారు. గత రెండు ఎన్నికల్లోనూ అచ్చెన్నని ఓడించలేకపోయారు. కానీ ఈ సారి మాత్రం ఓడించాలనే కసితో ఉన్నారు.

ఇదే సమయంలో దువ్వాడ శ్రీనివాస్‌ని టెక్కలి ఇంచార్జ్‌గా పెట్టారు. అధికార బలం మొత్తం ఉపయోగించి దువ్వాడ టెక్కలిలో రాజకీయంగా ఆధిక్యం సాధించాలని చూస్తున్నారు గాని..అది సాధ్యపడటం లేదు. పార్టీలో ఉండే అంతర్గత విభేదాలు తలనొప్పిగా మారాయి. అక్కడ పేరాడ తిలక్..దువ్వాడకు వ్యతిరేకంగా ఉన్నారు. ఆ మధ్య జగన్..తిలక్‌కు ఎమ్మెల్సీ సీటు ఇస్తానని హామీ ఇచ్చారు..అలాగే దువ్వాడ గెలిపించాలని కోరారు.

జగన్ హామీ ఇచ్చిన సరే పేరాడ వర్గం మాత్రం వెనక్కి తగ్గట్లేదు..టెక్కలి సీటుపైనే కన్నేసి ఉన్నారు. దాదాపు సీటు మాత్రం దువ్వాడకే ఫిక్స్. ఈ నేపథ్యంలో దువ్వాడకు..పేరాడ సహకరించే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. ఈ పరిస్తితుల్లో టెక్కలిలో అచ్చెన్నకు వైసీపీ బ్రేకులు వేయడం కష్టమే అని అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news