గుడివాడ : క‌న్వెన్ష‌న్ హాలుని స‌ర్ఫ్ తో క‌డిగేశారుగా? వ‌దిలేయండ్రా!

టీడీపీ ఎవ‌రు? జ‌న‌సేన‌కు డిపాజిట్లు వ‌చ్చాయా? ఎవ‌రు ఎందుకు మాట్లాడ‌తారు అని ప్ర‌శ్నిస్తోంది వైసీపీ. ఆ రోజు అక్క‌డేం జ‌ర‌గ‌లేదు.. మేమేం చేయ‌లేదు మీరే బూడిద తీసుకువ‌చ్చి మా నెత్తిన జ‌ల్లుతున్నారు అంటూ మండిపడిపోతోంది అధికార పార్టీ.  అవునా! నిజ‌మా! అయితే త‌ప్పు మాదే అని చెంపలేసుకుంటున్న‌ది జ‌న‌సేన. ఇంకా టీడీపీ కూడా! మంత్రి నానికి సారీ అండి అయితే!….

గుడివాడను ఏమీ అనవ‌ద్దు. మేం గుడివాడ‌ను ఏమీ అన‌ము కానీ గుడివాడ‌లో మంత్రి గారి ఫంక్ష‌న్ హాలుని స‌ర్ఫ్ పెట్టి మ‌రీ! క‌డిగించేసి సాక్ష్యాధారాలు అన్నీ లేకుండా చేసిన వైసీపీనే అంటాము లేదా మంత్రి అనుచ‌రుల‌నే అంటాము అని జ‌న‌సేన గొంతెత్తుతోంది. అయినా అక్క‌డేం జ‌రిగినా మేం మాట్లాడ‌కూడ‌దు అని అంటే మాట్లాడం అని కూడా అంటోంది. ఏమ‌యినా స‌రే రాష్ట్రంలో నాని చెప్పిందే వేదం అయి ఉంది క‌నుక అక్క‌డ ఓ ప‌విత్ర కార్య‌క్ర‌మం జ‌రిగి ఉంది కానీ మ‌న‌కు మాత్రం అది క్యాసినో మ‌రియు క్యాబ‌రే మాదిరి కనిపించి ఉంటుంది అని పేర్కొంటూ జ‌న‌సేన పెద‌వి విరుస్తోంది.

janasena-party

సంక్రాంతి అయిపోయి వారం రోజులు అయినా కూడా ఎవ్వ‌రూ ఈ విష‌యాన్ని వద‌ల‌డం లేదు. అంటే నాని మీద కంపోజ్ చేయించిన పాట అంత బాగుంద‌ని అంటూ జ‌న‌సేన ప‌దే ప‌దే అంటోంది. అంత గొప్ప పాట‌కు మంత్రి అనుచరులు వేసిన స్టెప్పులు కూడా వీడియో రూపంలో వ‌చ్చేసినా కూడా అక్క‌డేం జ‌ర‌గ‌లేద‌నే చెప్ప‌డం విడ్డూరం కూడా! అని వాపోతోంది జ‌న‌సేన.

గుడివాడ క్యాసినో త‌గువు గురించి తిరుప‌తి జ‌న‌సేన మాట్లాడుతోంది. మంత్రి గారు చెప్పిన మాట‌ల‌కూ, అక్క‌డ జ‌రిగిన దృశ్యాల‌కూ ఏం సంబంధం లేద‌ని ఆధారాల‌తో స‌హా నిరూపిస్తూ మాట్లాడింది. త‌న‌కు సంబంధించిన ఫంక్ష‌న్ హాల్ లో క్యాసినో ఏర్పాటైంద‌ని నిరూపిస్తే మంత్రిగారు పెట్రోల్ పోసుకుని ఆత్మ‌హ‌త్య చేసుకుంటాన‌ని చెప్ప‌డం విడ్డూరం అని పెద‌వి విరిచింది జ‌న‌సేన.

అందుకే ప్రెస్బీట్ కు పెట్రోలు డ‌బ్బా కూడా తీసుకుని వ‌చ్చి ఇప్పుడు తాము నిరూపించాము క‌నుక మంత్రి ఆత్మ‌హ‌త్య చెప్పిన విధంగానే చేసుకుంటారా అని నిలదీసింది. కానీ వైసీపీ మాత్రం వాద‌న మ‌రోవిధంగా వినిపిస్తోంది. అదంతా అబ‌ద్ధం అని, అస‌లు టీడీపీ నాయ‌కులు ఎవ‌రు అని నిజ నిర్థార‌ణ చేయ‌డానికి అని అంటూ తిట్టిపోస్తోంది. కానీ నాని మాత్రం ఒకే మాట అంటున్నారు తాను లేన‌ప్పుడు కొంద‌రు ఆడిన గెంతుల‌ను తాను ఆపాన‌ని అంటున్నారు.అంటే గెంతులు లేదా తైత‌క్క‌లూ జ‌రిగిన మాట నిజ‌మే క‌దా!మ‌రి!లేదంటారే!