అమరావతి: ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌కు మంత్రి కళా వెంకట్రావు బహిరంగ లేఖ రాశారు. ప్రతిపక్ష నేతగా జగన్ ఏనాడైనా ప్రజల కోసం పని చేశారా అని ప్రశ్నించారు. కేసుల మాఫీ కోసం ప్రధాని మోదీ, బీజేపీ అధినేత అమిత్ షాతో కుమ్మక్కై… కుట్రలు చేస్తున్నారని లేఖలో ఆయన ఆరోపించారు. తుపానుతో సిక్కోలు కకావికలమైతే బాధితులను ఎందుకు పరామర్శించలేదని, ఉత్తరాంధ్ర జిల్లాల్లో పాదయాత్ర చేస్తున్నప్పటికీ… రైల్వేజోన్, ఉత్తరాంధ్రకు నిధులపై ఏనాడైనా ప్రశ్నించారా అని నిలదీశారు. పోలవరం డీపీఆర్-2కు కేంద్రం కొర్రీలపై ఎందుకు మాట్లాడరని, రాఫెల్ కుంభకోణంపై జగన్ ఎందుకు మాట్లాడటం లేదని లేఖలో కళా వెంకట్రావు ప్రశ్నించారు.
విజయవాడ: ప్రకాశం బ్యారేజీ వద్ద విమాన విన్యాసాలు ప్రారంభమయ్యాయి. శుక్రవారం నుంచి మూడురోజులపాటు ఈ విన్యాసాలు జరుగుతాయి. రాష్ట్ర పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతోంది. కాగా… యూకేకు చెందిన గ్లోబల్‌స్టార్ సంస్థ ఈ విన్యాసాలను నిర్వహిస్తోంది. పున్నమిఘాట్ వద్ద ఎయిర్ షో ను న్యాయ, యువజన శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ప్రారంభించారు. ఈ విమాన విన్యాసాలను తిలకించేందుకు భారీగా వీక్షకులు వస్తారని అంచనా వేస్తున్నారు. చివరి రోజైన 25 వ తేదీన ముఖ్య మంత్రి ఈ షోలో పాల్గొననున్నారు.