మొదట నుంచి వివాదాల్లో ఉంటున్న బిఆర్‌ఎస్ ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి..మరోసారి బిజేపి ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పై రెచ్చిపోయారు. ఈటల రాజేందర్‌కు ప్రాణ హాని ఉందని…తాజాగా ఆయన భార్య జమునా కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. కౌశిక్ రెడ్డితో ఈటల ప్రాణాలకు ముప్పు అని మాట్లాడారు. ఈ క్రమంలో కౌశిక్ రెడ్డి స్పందిస్తూ.. ఈటల రాజేందర్‌ను హత్యచేయించాల్సిన అవసరం తనకు లేదని, సానుభూతి కోసం ఈటల దంపతులు డ్రామా చేస్తున్నారని విమర్శించారు.
ఇక అన్నీ సర్వేల్లో హుజూరాబాద్ లో తానే గెలుస్తానని తేలడంతో ఈటల దంపతులు కొత్త నాటకానికి తెర తీశారని, ఈటల కోసం 20 కోట్లు కాదు కదా.. 20 వేల రూపాయలు కూడా ఖర్చు చేయనని, ఈటల నుంచి తనకు కూడా ప్రాణహాని ఉందని, 2018 లో తనపై హత్యాయత్నం జరిగిందని అన్నారు. ఈటల రాజేందర్ కే నేరచరిత్ర ఉందని.. సాంబశివుడు, ఆయన తమ్ముడు హత్యకు ఆయనే కారణమని కౌశిక్ ఆరోపించారు.
అయితే ఇప్పటికే అనేక వివాదాల్లో ఉన్న కౌశిక్..ఈ మధ్య గవర్నర్‌ని అసభ్య పదజాలంతో దూషించి..జాతీయ మహిళా కమిషన్ నోటీసులు తీసుకుని చివరికి క్షమాపణ చెప్పారు..ఇటీవల ఓ యూట్యూబ్ చానల్ కెమెరామెన్‌ని కులం పేరుతో దూషించారు. ముదిరాజ్‌ల కులాన్ని తిట్టారు. దీంతో రాష్ట్రంలోని ముదిరాజ్‌లు కౌశిక్ పై ఫైర్ అవుతున్నారు..నిరసనలు చేస్తున్నారు..డిజిపికి ఫిర్యాదు చేశారు.
ఇక సొంత బిఆర్‌ఎస్ లోని ముదిరాజ్ నేతలు కౌశిక్ పై చర్యలు తీసుకోవాలని అంటున్నారు. ఇక తాను ఎవరిని తిట్టలేదని, అది మార్ఫింగ్ వీడియో అని, ఒకవేళ అదే నిజం అనుకుంటే క్షమించాలని కౌశిక్…ముదిరాజ్‌లని కోరారు. ఇదిలా ఉంటే తాజాగా ఈటలక కౌశిక్ వల్ల ప్రాణహాని ఉందని ప్రచారం వచ్చింది..దీంతో ఈటల కు కేంద్రం వై కేటగిరీ సెక్యూరిటీ ఇవ్వగా, మంత్రి కేటిఆర్..రాష్ట్రం నుంచి సెక్యూరిటీ పంపించారు. మొత్తానికి కౌశిక్ రెడ్డి అన్నీ వైపులా వివాదాల్లోనే ఉన్నారు.