ఉపఎన్నికలు వస్తే చాలు…కేసీఆర్‌కు ప్రజలు గుర్తొచ్చేస్తారు.. అలా ఉపఎన్నిక జరిగే నియోజకవర్గానికి వరాలు కురిపిస్తారు… నిధులు వరద పారిస్తారు. ఉపఎన్నిక లేకపోతే ఇవేమీ కేసీఆర్‌కు పెద్ద పట్టింపు ఉండవనే విమర్శలు ఉన్నాయి. అంటే ఉపఎన్నిక వస్తేనే కేసీఆర్‌లో కదలిక వస్తుందని చెప్పొచ్చు. ఇక తాజాగా తెలంగాణలో మునుగోడు ఉపఎన్నిక వేడి రాజుకుంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో మునుగోడు ఉపఎన్నిక అనివార్యమైన విషయం తెలిసిందే.
అయితే దుబ్బాక, హుజూరాబాద్ మాదిరిగా ఈ స్థానాన్ని కూడా గెలుచుకోవాలని బీజేపీ చూస్తుంది..బలమైన కోమటిరెడ్డిని ముందు పెట్టి కేసీఆర్‌కు చెక్ పెట్టాలని చూస్తుంది. సాధారణ ఎన్నికల ముందు జరగనున్న ఈ మునుగోడు ఉపఎన్నిక ఒక సెమీఫైనల్ మాదిరిగా ఉంది. ఈ ఉపఎన్నికలో ఏ పార్టీ గెలిస్తే…ఆ పార్టీ సాధారణ ఎన్నికల్లో సత్తా చాటే అవకాస్లౌ మెదుగా ఉంటాయి. అందుకే ఈ స్థానాన్ని వదులుకోకూడదని అటు టీఆర్ఎస్, ఇటు బీజేపీలతో పాటు కాంగ్రెస్ ప్రయత్నిస్తుంది.
అయితే ఈ ఉపఎన్నికలో అధికార టీఆర్ఎస్ ఓడిపోతే..ఆ పార్టీకి గడ్డు పరిస్తితులు మొదలైనట్లే…అందుకే ఈ ఉపఎన్నికలో ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో టీఆర్ఎస్ అధిష్టానం ఉంది. ఇక్కడ గెలవడానికి అన్ని రకాల వ్యూహాలతో ముందుకెళుతుంది. ఇప్పటికే మునుగోడుపై వరాల జల్లు కురిపిస్తున్న విషయం తెలిసిందే. అలాగే పింఛన్ల లబ్దిదారులని పెంచింది. ఇదే క్రమంలో మరో సరికొత్త పథకాన్ని అమలు చేయాలని కేసీఆర్ డిసైడ్ అయినట్లు తెలుస్తోంది.
హుజూరాబాద్ ఉపఎన్నిక ముందు ఒక్కో దళిత కుటుంబానికి రూ.10 లక్షలు ఇస్తామని చెప్పి దళితబంధు పథకాన్ని తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ పథకాన్ని మొదట హుజూరాబాద్‌లో అమలు చేశారు..తర్వాత ఒక్కో నియోజకవర్గంలో 100 కుటుంబాలకు ఇవ్వడానికి ఫిక్స్ అయ్యారు. కానీ ఈ పథకం అమలు చాలా నిదానంగా ఉంది…దళితబంధు పూర్తిగా సక్సెస్ కాలేదు. హుజూరాబాద్ ఉపఎన్నికలో ఓడిపోయాక టీఆర్ఎస్ సర్కార్ దీనిపై పెద్దగా ఫోకస్ పెట్టలేదు. కానీ మునుగోడు ఉపఎన్నికని దృష్టిలో పెట్టుకుని మరో కొత్త పథకానికి శ్రీకారం చుట్టాలని కేసీఆర్ చూస్తున్నట్లు తెలిసింది. నియోజకవర్గంలో ఉన్న పెండింగ్ అభివృద్ధి పనులతోపాటు, కొత్తగా కొన్ని పథకాలు ప్రకటించాలని ముఖ్యమంత్రి యోచిస్తున్నట్లు టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. మరి ఈ సారి కేసీఆర్ ఎలాంటి ప్రయోగం చేస్తారో చూడాలి.