కేసీఆర్ అదిరిపోయే వ్యూహం…ఒకే దెబ్బకు రెండు పిట్టలు…

తెలంగాణ రాజకీయాల్లో సీఎం కేసీఆర్ వ్యూహాలు పన్నడంలో ధిట్ట అని చెప్పాల్సిన పని లేదు. ఆయన వ్యూహాలు వేస్తే, ప్రత్యర్ధులు చిత్తు అవ్వాల్సిందే. ఇప్పటివరకు అలాగే కేసీఆర్, తన వ్యూహాలతో ప్రత్యర్ధులకు చెక్ పెడుతూ వచ్చారు. తాజాగా తెలంగాణలో ప్రతిపక్షాల దూకుడు పెరిగింది. దీంతో కేసీఆర్ వ్యూహాత్మకంగా ముందుకెళుతున్నారు. ఇప్పటికే నీటి వివాదంలో బీజేపీ, కాంగ్రెస్‌లని ఇరుకున పెట్టే ప్రయత్నం చేశారు.

cm-kcr
cm-kcr

తాజాగా సరికొత్త స్కీమ్‌తో తెలంగాణలోని దళితులని ఆకట్టుకునే ప్రయత్నం మొదలుపెట్టారు. తెలంగాణ దళితబంధు పేరిట కొత్త స్కీమ్‌ని తీసుకొస్తున్నారు. అది కూడా ఉపఎన్నికలు జరగనున్న హుజూరాబాద్ నియోజకవర్గం నుంచే పథకాన్ని మొదలుపెట్టనున్నారు. ఇక్కడ ఎస్సీలు ఎక్కువ సంఖ్యలో ఉన్న విషయం తెలిసిందే. అందుకే ఈ నియోజకవర్గాన్నే మొదట ఎంచుకుని పథకాన్ని అందివ్వనున్నారు.

ఇక్కడ ప్రజలు మాజీ మంత్రి ఈటల రాజేందర్‌కు మద్ధతుగా ఉన్నారనే నేపథ్యంలో కేసీఆర్ ఈ స్కీమ్ తీసుకొచ్చి, ఈటలకు చెక్ పెట్టే ప్రయత్నం చేస్తున్నారని చెప్పొచ్చు. అదే సమయంలో తెలంగాణలో దళితులు కాంగ్రెస్‌కు ఎక్కువగా మద్ధతుగా ఉంటారు. రేవంత్ రెడ్డి ఎంట్రీతో కాంగ్రెస్ మరింత పుంజుకుంటుంది.  ఈ క్రమంలోనే ఇటీవల మరియమ్మ లాకప్ డెత్ విషయంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలని కలిసి, మరియమ్మ కుటుంబాన్ని ఆదుకుంటానని కేసీఆర్ చెప్పారు.

ఇక ఇప్పుడు దళిత బంధు స్కీమ్ తీసుకొచ్చి, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దళితులని మరింత దగ్గర చేసుకోవడమే లక్ష్యంగా కేసీఆర్ ముందుకెళుతున్నారని తెలుస్తోంది. అటు ఇప్పుడుప్పుడే రాజకీయాలు మొదలుపెట్టిన షర్మిలకు కూడా చెక్ పెట్టడానికి ఈ స్కీమ్ పనికొచ్చేలా కనిపిస్తోంది. మొత్తానికి ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లుగా కేసీఆర్ ఒక్క వ్యూహంతో, అటు ఈటలకు, ఇటు రేవంత్ రెడ్డికి చెక్ పెట్టనున్నారు.