క్లారిటీగా కేశినేని..మళ్ళీ రెడీ?

విజయవాడ రాజకీయాల్లో టీడీపీ ఎంపీ కేశినేని నాని చుట్టూ ఎప్పుడు ఏదొక వివాదం నడుస్తూనే ఉంటుంది…మరి ఆయనే వివాదాలు కొనితెచ్చుకుంటారో లేక…వివాదాలు ఆయన్ని వెతుక్కుంటూ వస్తాయో తెలియదు గాని..కేశినేని అంటే కాంట్రవర్సీ అన్నట్లు తయారైంది. అది కూడా సొంత పార్టీలోనే వివాదాలే ఆయన చుట్టూ నడుస్తాయి. మొదట నుంచి విజయవాడ టీడీపీలో గ్రూపు తగాదాలు ఉన్న విషయం తెలిసిందే. కేశినేని నాని-బుద్దా వెంకన్నలకు పడదనే సంగతి తెలిసిందే. కేశినేని-గద్దె ఒక గ్రూపు అయితే…బుద్దా-బోండా ఉమా ఒక గ్రూపుగా ఉంటున్నారు. వీరికి ఏ మాత్రం పొసగడం లేదు.

వీరి గ్రూపు తగాదాల వల్లే విజయవాడ కార్పొరేషన్ లో టీడీపీ ఘోరంగా ఓడిపోయింది. అయితే కేశినేని నాని..పలుమార్లు సొంత పార్టీపైనే విమర్శలు చేశారు…అలాగే కొన్ని రోజుల పాటు పార్టీకి దూరంగా ఉండేవారు…మళ్ళీ పార్టీలో కనిపించేవారు. ఈ మధ్య కూడా విజయవాడలో కేశినేని బాగా హాట్ టాపిక్ అయ్యారు. టీడీపీలో కేశినేని సోదరుడు శివనాథ్ బాగా యాక్టివ్ గా ఉంటున్నారు…వచ్చే ఎన్నికల్లో కేశినేనికి చెక్ పెట్టడానికి టీడీపీ అధిష్టానం శివనాథ్ కు సపోర్ట్ ఇస్తుందని, ఆయనకు విజయవాడ ఎంపీ సీటు ఇవ్వాలని చూస్తుందని కథనాలు వచ్చాయి.

ఇదే క్రమంలో కేశినేని…టీడీపీపై విమర్శలు చేశారు…” నా శత్రువు నీకు మిత్రుడు అయితే.. నీ శత్రువు నాకు మిత్రుడు.. నా శత్రువును నువ్వు ప్రోత్సహిస్తే.. నీ శత్రువును నేను ప్రోత్సహిస్తా.. నా ఇల్లు నీకెంత దూరమో.. నీ ఇల్లు నాకూ అంతే దూరం” అంటూ ఫైర్ అయ్యారు. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో కేశినేని టీడీపీని వీడటం ఖాయమని ప్రచారం జరిగింది.

కానీ ఇంతలోపే కేశినేని మరో ట్విస్ట్ ఇచ్చారు..ఏదో కార్యక్రమంలో చంద్రబాబుని పొగుడుతూ…జగన్ పై విమర్శలు చేశారు. అలాగే ఇప్పుడు టీడీపీ కార్యక్రమాల్లో యాక్టివ్ గా ఉంటున్నారు. దీంతో కేశినేని టీడీపీని వీడరని,మళ్ళీ ఆయన టీడీపీ నుంచి పోటీ చేసి విజయవాడలో సత్తా చాటుతారని కేశినేని అనుచరులు అంటున్నారు. మొత్తానికి కేశినేని టీడీపీతోనే ఉంటారని తెలుస్తోంది. అలాగే మళ్ళీ విజయవాడ ఎంపీగా బరిలో దిగనున్నారు.