ఎంతో మంది విద్యార్థుల ఆత్మబలిదానాలు, పోరాటాల ద్వారా సాధించుకున్న తెలంగాణను కల్వకుంట్ల, ఓవైసీ కుటుంబాలు దోచుకుంటున్నాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. తెంలంగాణ సాధించేందుకు కేసీఆర్ ఒక్కడే పోరాడలేదని రాష్ట్రంలోని ప్రతి కుటుంబం పిల్లా జెల్లా సైతం రోడెక్కి ప్రాణాలు అర్పించారన్నారు. మంత్రి వర్గ నిర్ణయాలను పక్కనబెట్టి ముఖ్యమంత్రి కేసీఆర్ సొంత నిర్ణయాలు తీసుకుంటారని వాటికి ఓవైసీ వత్తాసు పలుకుతారని మంత్రి కిషన్‌రెడ్డి ధ్వజమెత్తారు. భయపెట్టి భూములు లాక్కోవడం, భయభ్రాంతులకు గురిచేసి ఓట్లు దండుకుంటున్న టీఆర్‌ఎస్ నాయకులకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటుతోనే సమాధానం చెప్పాలని ఆయన పిలుపునిచ్చారు. ఎన్నికలు రాగానే టీఆర్‌ఎస్, ఎంఐఎం ఒకరిపై ఒకరు బద్ద శత్రువుల్లాగా విమర్శలు చేసుకుని చివరి క్షణాలో దోస్తీ కట్టి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు.
అసంతృప్తిలో ప్రజలు..
టీఆర్‌ఎస్ ప్రభుత్వ పాలనతో రాష్ట్ర ప్రజలు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారని మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. హామీల గుప్పించి ఓట్లు దండుకొని ఇచ్చిన హామీలను విస్మరించి ప్రజలను మోసం చేస్తున్నారని ధ్వజమెత్తారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధి కోసం పలు ప్రాజెక్ట్‌లు చేపట్టి పూర్తి చేసిందని పేర్కొన్నారు. ఇప్పటి వరకు ఎయిమ్స్, జాతీయ రహదారులు పూర్తయ్యాయని, రామగుండం ఎరువుల కర్మాగారం ప్రారంభానికి సిద్ధంగా ఉందని గుర్తు చేశారు. ఐటీఐఆర్ ఆగిపోవడానికి టీఆర్‌ఎస్సే కారణమన్నారు. తెలంగాణ ప్రభుత్వం సరైన సహకారం ఇవ్వకపోవడంతోనే ఐటీఐఆర్ నిలిచిపోయిందన్నారు. రాష్ట్రంలో జరుగున్న అరాచకాలను దృష్టిలో పెట్టుకొని ఎమ్మెల్సీ ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని మంత్రి కిషన్‌రెడ్డి పేర్కొన్నారు.